Gautam Gambhir: 2024 To 2027.. గంభీర్ ముందున్న అతి పెద్ద సవాళ్లు ఇవే!

Gautam Gambhir: 2024 To 2027.. గంభీర్ ముందున్న అతి పెద్ద సవాళ్లు ఇవే!

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తైన విషయం తెలిసిందే. జాతీయ పురుషుల సీనియర్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీతో రాహుల్‌ ద్రావిడ్‌ పదవీకాలం ముగియడంతో ఆ బాధ్యతలు గంభీర్‌కు అప్పగిస్తున్నట్టు అందులో పేర్కొంది. గౌతీ 2027 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇది బాగానే ఉన్నా, కోచ్‌గా గంభీర్ మార్క్ చూపెట్టగలరా అనేది అందరిముందున్న ప్రశ్న. 

ALSO READ | టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా హైదరాబాదీ.. ఎవరీ అభిషేక్ నాయర్?

గంభీర్‌కు గతంలో ఎలాంటి కోచింగ్ అనుభవం లేనప్పటికీ, ఐపీఎల్ టోర్నీలో పలు జట్లకు మెంటార్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది తన శిక్షణలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టును విజేతగా నిలిపారు. మాజీ ఓపెనర్‌కున్న ఈ అనుభవం భారత జట్టును సమర్థవంతంగా నడిపించడానికి సరిపోతుందా..! అనేది కాలమే తేల్చాలి. అందునా, ఈ విషయాన్ని గంభీర్ ముందుగానే చెప్పారు. భారత జట్టు కోచ్ బాధ్యతలంటే.. 140 కోట్ల భారతీయుల బాధ్యతలని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

కోచ్‌గా ద్రవిడ్ సక్సెస్

టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ తనదైన ముద్ర వేశారు. అతని హయాంలో భారత జట్టు గత 12 నెలల్లో మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌ చేరింది. ఇది అంత చిన్న విషయం కాదు. పొట్టి ప్రపంచకప్ విజయంతో 'ది వాల్' భారత ప్రధాన కోచ్‌ స్థాయిని మరింత పెంచాడు. కావున, ద్రవిడ్ వారసత్వాన్ని కొనసాగించడం గంభీర్‌కు అంత సులభతరం కాదు. అందునా, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించడం, ఆటగాళ్లను సమన్వయపర్చడం, యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడం అతని ముందున్న సవాళ్లు. వీటికి తోడు రాబోయే తన మూడేళ్ళ పదవీ కాలంలో పలు మేజర్ టోర్నీలో ఉన్నాయి.

  • 2024: ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ఆసీస్ గడ్డపై) 
    2025: ఛాంపియన్స్ ట్రోఫీ
    2025 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ 
    2025: ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ఇంగ్లీష్ గడ్డపై) 
    2026: టీ20I ప్రపంచకప్ 
    2026: న్యూజిలాండ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (కివీస్ గడ్డపై) 
    2027: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్
    2027: వన్డే ప్రపంచకప్