- డెమోక్రటిక్ అభ్యర్థిపైమరోసారి వ్యక్తిగత విమర్శలు
- ట్రంప్ ర్యాలీ.. అదే ఓల్డ్ షో అంటూ కమలా హారిస్ టీమ్ రిటార్ట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలోకి దిగిన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఒక క్రేజీ పర్సన్ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కమల నవ్వు వెర్రిగా ఉంటుందని, చూడటానికి ఆమె కంటే తానే చాలా బాగుంటానంటూ ఆయన కామెంట్ చేశారు. శనివారం పెన్సిల్వేనియాలోని విల్కిస్ బారేలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. కమలపై మరోసారి ఇలా తీవ్రంగా వ్యక్తిగత విమర్శలకు దిగారు. ‘‘కమలా హారిస్ నవ్వును చూశారా? చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె పిచ్చి వ్యక్తిలా వెర్రి నవ్వులు నవ్వుతారు. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఇటీవల కమల చిత్రాన్ని ఓ ఆర్టిస్ట్ తో గీయించారు. ఆమెను ఎన్నో ఫొటోలు తీశారు. కానీ ఒక్క ఫొటో కూడా వారికి నచ్చలేదు. అందుకే ఆర్టిస్ట్ తో బొమ్మ గీయించి పెట్టారు. నిజానికి చూడటానికి ఆమె కంటే నేనే చాలా బాగుంటా” అని ట్రంప్ కామెంట్లు చేశారు. కమల అంటే తనకు గౌరవం లేదని, అందుకే ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు తనకు ఉందని వ్యాఖ్యానించారు.
కమల రాడికల్ లీడర్ అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు సంబంధించి కమలా హారిస్ శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ప్రణాళికలు వ్యర్థమని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఫుడ్, హౌసింగ్ కాస్ట్ తగ్గిస్తానని చెప్తున్నారని, కానీ మూడున్నర ఏండ్ల కిందటే ఆమెకు ఆ మొదటిరోజు వచ్చిందన్నారు. ‘కామ్రేడ్ కమల సోషలిస్ట్ విధానంలో ధరల నియంత్రణ తేవాలని అనుకుంటున్నారు. ఆమె రాడికల్, పిచ్చి మనస్తత్వం ఉన్న నాయకురాలు’ అని విమర్శించారు. ‘‘అధ్యక్ష ఎన్నికల్లో మొదట బైడెన్ నాకు ప్రత్యర్థిగా ఉన్నారు. కానీ ఇప్పుడు కమలా హారిస్ తెరపైకి వచ్చారు. అసలు ఎవరీ కమలా హారిస్? ప్రెసిడెంట్ బైడెన్ను ఆమెనే కూలదోశారు. ఆయనను అధ్యక్ష అభ్యర్థిగా తప్పించి, తాను రేసులోకి వచ్చారు” అని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
ట్రంప్ ది అదే ఓల్డ్ షో: కమలా హారిస్ టీమ్
పెన్సిల్వేనియాలో శనివారం ట్రంప్ నిర్వహించిన ర్యాలీలో కొత్త విషయాలు ఏమీ లేవని కమలా హారిస్ టీమ్ పేర్కొంది. ‘‘మరో ర్యాలీ, అదే ఓల్డ్ షో” అని కమల క్యాంపెయిన్ టీమ్ అధికార ప్రతినిధి జోసెఫ్ కాస్టెల్లో ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలు, అబద్ధాలు, గందరగోళ కామెంట్లు తప్ప ఆయన స్పీచ్ లో కొత్తగా ఏమీ లేదన్నారు.