అత్యంత వేడి సంవత్సరంగా 2024

భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. 123ఏండ్ల ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్​ అధికంగా నమోదైందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా ఉన్న 2017 రికార్డును 2024 దాటింది.  

ఇటీవల బాకులో జరిగిన యునైటెడ్​ నేషన్స్​ ​ క్లైమేట్​ కాన్ఫరెన్స్​(కాప్​29) సదస్సు సందర్భంగా ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన స్టేట్​ ఆఫ్​ ది క్లైమేట్​ 2024 రిపోర్ట్​లో 2024లో  అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడైంది.
    
కొపర్నికస్​ క్లైమేట్​ చేంజ్​ సర్వీస్​(సీ3ఎస్) కూడా 2024ను గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా పేర్కొన్నది. అంతర్జాతీయ వాతావరణాన్ని నమోదు చేయడం 1850లో ప్రారంభమైందని, అప్పటి నుంచి అత్యంత ఎక్కువ వేడి వాతావరణం గత ఏడాదే నమోదైనట్లు తెలిపింది.పారిశ్రామిక యుగం ముందున్న ఉష్ణోగ్రతల సగటు కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైన తొలి ఏడాదిగా నిలిచిందని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత

ప్రస్తుతం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.10 డిగ్రీల సెల్సియస్​గా ఉంది. ఇది 1991–2020 నాటి కాలం కంటే 0.72 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ. అలాగే, 2023 సగటు నాటి స్థాయి కంటే 0.12 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.2024లో ఉష్ణోగ్రతలు మొదటిసారిగా ప్రీ ఇండస్ట్రియల్​ లెవల్​ కాలం నాటి స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్​ దాటిపోయాయి.