రివైండ్ 2024 - భలే చాన్సులే: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. తొలిసారి పార్లమెంటుకు ప్రియాంక

రివైండ్ 2024 -  భలే చాన్సులే: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. తొలిసారి పార్లమెంటుకు ప్రియాంక

కొందరికి అదృష్టం తలుపు తట్టింది. పదవులు వరించాయి. బండి సంజయ్ కేంద్ర మంత్రయ్యారు. మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడయ్యారు. రాహుల్ రాజీనామా చేయడంతో ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. గతంలో ఒకే ఒక్క స్థానం గెలిచిన జనసేన ఏపీలో పోటీ చేసిన అన్నిచోట్లా సత్తా చాటింది.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు.

మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్

ఎట్టకేలకు పీసీసీ చీఫ్ ఎవరనేది ఏఐసీసీ తేల్చింది. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం రహత్ నగర్ గ్రామానికి చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమిచింది. పార్టీకి విధేయుడిగా వ్యవహరించిన మహేశ్ కుమార్ గాంధీ భవన్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలకు శ్రీకారంచుట్టారు. మంత్రులను వారానికి ఒక్కసారి గాంధీ భవన్ కు పిలిచి మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులతో ఉన్న గ్యాప్ ను ఎప్పటికప్పుడు పూడ్చుతూ.. స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. నిరసన కారులు సైతం గాంధీభవన్ కు వచ్చి సమస్య చెప్పుకొనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రశంసలు అందుకున్నారు.

రాహుల్ రాజీనామా ప్రియాంకను ఎంపీ చేసింది

ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ స్థానాల్లో ఎంపీగా విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒకే స్థానంలో ఎంపీగా కొనసాగాలి. దీంతో ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రియాంక 4,08.036 ఓట్ల మెజార్టీతో తన సమీప సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిపై గెలుపొందారు. అన్న రాజీనామా చెల్లెలుకు కలిసొచ్చింది. లోక్ సభలో రాహుల్, ప్రియాంక ఇద్దరు కలిసి ప్రజల పక్షాన గళమెత్తుతుండటం విశేషం.

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం

జనసేనానికి ఈ యేడు బాగా కలిసొచ్చింది. ఆయన పట్టిందల్లా బంగారమైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గ్లాస్ పార్టీని అందలం ఎక్కించాయి. ఫలితంగా పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీచేసిన జన సేన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వ్యవస్థలోని లోపాలపై, అధికారులు, మంత్రుల చిత్తశుద్ధిపై హాట్ హాట్ కామెంట్లు చేస్తూ.. ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ALSO READ | టాక్ ఆఫ్ ది ఇయర్ : ఫాంహౌస్ నుంచి కదలని కేసీఆర్.. రాజ్యాంగానికి మొక్కిన మోడీ..

ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు

రాష్ట్రం నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ కేబినెట్ మంత్రిగా మెదీ-3.0 లో కొలువు దీరారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కూ మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

నాగబాబుకు మంత్రి పదవి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేనాని సోదరుడు నాగేంద్రబాబుకు లక్కీచాన్స్ వచ్చింది. నాగబాబును ఏపీ క్యాబినెట్ లోకి తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయనను ఎమ్మెల్సీగా నియమించి మంత్రి పదవిని కట్టబెట్టనున్నారు. అయితే ఆయన ఈ ఏడాది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. 2025లో ఆయన మంత్రిగా ప్రమాణం చేసే చాన్సు ఉంది.

ALSO READ | న్యూస్ రీల్ 2024