
ఎప్పటిలాగే ప్రతి శుక్రవారం థియేటరర్లో సినిమాల జాతర ఉంటుంది. గడిచిన వారంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, జాట్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాలొచ్ఛాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి. మరికొన్ని నిరాశను మిగిల్చాయి.
ఈ వారం కూడా థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉండనుంది. శుక్రవారం (2025 ఏప్రిల్ 18న) ఓ మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హిందీ నుంచి ఓ స్టార్ హీరో మూవీ రానుంది. మరి ఆ సినిమాలేంటీ? వాటి జోనర్స్ ఏంటనేది తెలుసుకుందాం.
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’:
విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. దానికితోడు మదర్ ఎమోషన్ తో వస్తోంది. తల్లిపడే ఆరాటం, కొడుకు చేసే పోరాటంతో సినిమా రానుంది.
‘ఓదెల 2’:
తమన్నా లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). దర్శకుడు సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ రూపొందించాడు. డి మధు నిర్మించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. 2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి పార్టులో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించగా.. పార్ట్ 2లో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఎక్సయిట్‌మెంట్‌ను పెంచేశాయి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘కేసరి చాప్టర్ 2’:
స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే మరియు ఆర్ మాధవన్ నటించిన 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది.
కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్‌ను ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ మరియు లియో మీడియా కలెక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు.
ఇందులో అక్షయ్ కుమార్ నిర్భయ న్యాయవాది సర్ సి శంకరన్ నాయర్ పాత్రను పోషిస్తున్నాడు. అమృత్సర్‌లో జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తుండటంతో అంచనాలు పెరిగాయి.
‘నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమరీస్’:
రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. దర్శకుడు ఎస్.గోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ రవితేజ కెరీర్‌లో వెరీ స్పెషల్. బాక్సాఫీస్ దగ్గర లెక్కలు సరిచేయకున్నా, సినిమా చూసిన ప్రేక్షకుడి హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి ఇచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఈ మూవీ ఏప్రిల్ 18న రీ రిలీజ్ కానుంది.