అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2025ను కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో కృత్రిమ మేధను మిళితం చేయడం, విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. అందుకు ప్రాథమికంగా పలు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నెలాఖరులోపు కృత్రిమ మేధ అమలు ప్రణాళికను సమర్పించాలని దేశవ్యాప్తంగా తన పరిధిలోని 14 వేల విద్యాసంస్థల ప్రిన్సిపల్స్‌కు, డైరెక్టర్లకు ఏఐసీటీఈ లేఖ రాసింది. కృత్రిమ మేధలో ఉత్తమ పనితీరు కనబరిచే కళాశాలలను పురస్కారాలు ప్రకటిస్తుంది. అందరికీ ఏఐ పేరిట విద్యాసంస్థల ప్రాంగణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు పలు రకాల కార్యక్రమాలను ఏఐసీటీఈ సూచించింది. అవి..
అవగాహన వారోత్సవాలు: వర్క్‌షాప్‌లు, నిపుణుల ప్రసంగాలు, హ్యాకథాన్ల నిర్వహణ.
స్టూడెంట్ చాప్టర్స్ ఏర్పాటు: విద్యార్థులు ఒకరికి ఒకరు కలిసి నేర్చుకోవడం, ఏఐలో ఆవిష్కరలు చేయడం.
ల్యాబ్‌లు: కళాశాలల్లో ఏఐ ల్యాబ్‌లు నెలకొల్పడం.
కెరీర్ మార్గం: విద్యార్థులకు ఏఐ రంగంలో అవకాశాలతోపాటు తదితర వాటిపై కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహించడం.
అధ్యాపకులకు శిక్షణ: అన్ని బ్రాంచీల్లో కృత్రిమ మేధ పాఠ్యాంశాలను చేరుస్తారు. ప్రాథమిక అంశాలతోపాటు అడ్వాన్స్డ్ ఏఐ పాఠ్యాంశాలను చేర్చి సిలబస్‌ను ఉన్నతీకరించాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.