ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌.. చరిత్ర సృష్టించిన జొకోవిచ్‌

  • అత్యధిక గ్రాండ్‌‌స్లామ్‌‌ మ్యాచ్‌‌లు ఆడిన ప్లేయర్‌‌‌గా నొవాక్‌ ఘనత
  • రోజర్‌‌ ఫెడరర్‌‌ రికార్డు బ్రేక్‌‌
  • ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో మూడో రౌండ్‌‌  చేరిన సెర్బియా లెజెండ్‌

మెల్‌‌బోర్న్‌‌: సెర్బియా స్టార్‌‌ ప్లేయర్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ టెన్నిస్‌‌ చరిత్రలో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యధిక గ్రాండ్‌‌ స్లామ్‌‌ మ్యాచ్‌‌లు (430) ఆడిన తొలి ప్లేయర్‌‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో భాగంగా బుధవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో జొకోవిచ్‌‌ 6–1, 6–7 (4), 6–3, 6–2తో జెమీ ఫరియా (పోర్చుగల్‌‌)పై గెలిచి మూడో రౌండ్‌‌లోకి చేరుకోవడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. తద్వారా స్విస్‌‌ లెజెండ్‌‌ ప్లేయర్‌‌ రోజర్‌‌ ఫెడరర్‌‌ (429 మ్యాచ్‌లు) రికార్డును బ్రేక్‌‌ చేశాడు. 

ఇక మేజర్‌‌ టోర్నీలో నొవాక్‌‌ తన కెరీర్‌‌ రికార్డును కూడా (379–51) మెరుగుపర్చుకున్నాడు. 429 స్లామ్‌‌ మ్యాచ్‌‌ల్లో ఫెడరర్‌‌ రికార్డు 369–60గా ఉంది. మెన్స్‌‌లో అత్యధిక గ్రాండ్‌‌స్లామ్స్‌‌ (24) గెలిచిన ప్లేయర్‌‌గా జొకోవిచ్‌‌ ఇప్పటికే రికార్డులకెక్కాడు. తర్వాతి ప్లేస్‌‌ల్లో ఉన్న రఫెల్‌‌ నడాల్‌‌ (22), ఫెడరర్‌‌ (20) రిటైర్ అవ్వడంతో ఈ రికార్డును బ్రేక్‌‌ చేయడం అసాధ్యం అనొచ్చు. ఇతర మ్యాచ్‌‌ల్లో అల్కరాజ్‌‌ (స్పెయిన్‌‌) 6–0, 6–1, 6–4తో నిషియోక (జపాన్‌‌)పై, జ్వెర్వెవ్‌‌ (జర్మనీ) 6–1, 6–4, 6–1తో మార్టినెజ్ (స్పెయిన్‌‌)పై గెలవగా, ఆరో సీడ్ కాస్పర్ రూడ్‌‌ (నార్వే) 2–6, 6–3, 1–6, 4–6తో మెన్సిక్‌‌ (చెక్‌‌) చేతిలో ఓడాడు. 

విమెన్స్‌‌ రెండో రౌండ్‌‌లో సబలెంక (బెలారస్‌‌) 6–3, 7–5తో మనెరో (స్పెయిన్‌‌)పై, పెగులా (అమెరికా) 6–4, 6–2తో మార్టెన్స్‌‌ (బెల్జియం)పై, గాఫ్‌‌ (అమెరికా) 6–3, 7–5తో బురాగె (ఆస్ట్రేలియా)పై గెలవగా, జాంగ్‌‌ (చైనా) 6–3 (3/7), 3–6తో సెగ్మెండ్‌‌ (జర్మనీ) చేతిలో పరాజయం చవిచూశారు. మెన్స్‌‌ డబుల్స్‌‌లో ఇండియా ప్లేయర్లు యూకీ భాంబ్రీ–ఒలివెటి (ఫ్రాన్స్‌‌) 2–6, 6–7 (3/7)తో స్కూల్‌‌కెట్‌‌–వాల్టన్‌‌ (ఆస్ట్రేలియా) చేతిలో, రోహన్‌‌ బోపన్న–బారెంటోస్‌‌ (కొలంబియా) 5–7, 6–7 (5/7)తో మార్టినేజ్‌–మునార్ (స్పెయిన్‌) చేతిలో కంగుతిన్నారు.