
నార్కట్‌పల్లి, వెలుగు : ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు పోెటెత్తారు. నార్కెట్ పల్లి మండలం చెర్వుగట్టు ఉత్సవాలు నేటి నుంచి ఈనెల 9 వరకు జరగనున్నాయి. ఈనెల 4న స్వామివారి కల్యాణం, -6న స్వామివారి అగ్ని గుండాలు నిర్వహించనున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని భక్తుల కోరుకుంటారు.
అందులో భాగంగా పండించిన కందులు, ఆముదాలు అగ్నిగుండంలో వేసి ముక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, మహబూబునగర్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాటు చేశారు.
భద్రత కట్టుదిట్టం..
బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. నలుగుగురు డీఎస్పీలు,20 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 92 మంది ఏఎస్ఐలు, 150 మంది కానిస్టేబుల్స్, 102 మంది హోంగార్డులు,102 మంది మహిళా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే 8712670186 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రత్యేకంగా ఫోన్ నంబర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలి...
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వాహకులు, అధికారులకు సూచించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్, సంబంధిత అధికారులతో కలిసి శనివారం చెరువుగట్టును ఆమె సందర్శించారు. ఆదివారం నుంచి ప్రారంభంకానున్న పార్వతి జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తులకు అన్ని వసతులు
జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. గుట్టపై మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యం కల్పించాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రసాదాలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశాం. భక్తులకు అందుబాటులో ఉండేలా దర్శనం దారిలో సమాచార కేంద్రం ఏర్పాటు చేశాం.
- ఆలయ ఈవో ఎస్.నవీన్