- షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీబీ
లండన్ : వచ్చే ఏడాదిలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తేదీలను, వేదికలను ప్రకటించింది. ఈ సిరీస్‌తో టీమిండియా నాలుగో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2025–2027)ను మొదలుపెట్టనుంది. ఇంగ్లిష్ స్వింగ్ బౌలర్లకు అనుకూలంగా ఉండేలా ఈసీబీ వేదికలను ఖరారు చేసింది. జూన్ 20 నుంచి 24 వరకు తొలి టెస్ట్ (లీడ్స్) జరగనుంది. జులై 2 నుంచి 6 వరకు రెండో టెస్ట్ (బర్మింగ్‌హామ్), 10 నుంచి 14 వరకు మూడో టెస్ట్ (లార్డ్స్), 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)
31 నుంచి ఆగస్టు 4 వరకు ఐదో టెస్ట్ (ఓవల్) జరగనున్నాయి. ప్లేయర్లు గాయపడినా కోలుకునే విధంగా ప్రతి మ్యాచ్‌కు మధ్య సరిపోయినంత విరామం ఇచ్చారు.2021లో ఇంగ్లండ్‌లో చివరిసారి జరిగిన సిరీస్‌ను ఇండియా 2–2తో డ్రా చేసుకుంది. ఇక ఇండియా, ఇంగ్లండ్ విమెన్స్ మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను కూడా ఈసీబీ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ 28, జులై 1, 4, 9, 12న నాటింగ్‌హామ్, బ్రిస్టల్, ఓవల్, మాంచెస్టర్, ఎడ్జ్‌బాస్టన్‌లో వరుసగా ఐదు టీ20లు జరుగుతాయి. సౌతాంప్టన్ (జులై 16), లార్డ్స్ (జులై 19), డర్హమ్ (జులై 22)లో మూడు వన్డేలు ఆడనున్నారు. 2026లో లార్డ్స్‌లో తొలిసారి ఇరుజట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది.