- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్
కోల్‌కతా : వరుసగా రెండు టెస్టు సిరీస్‌ల్లో నిరాశపరిచిన టీమిండియా స్వదేశంలో ధనాధన్ ఆటతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తమకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో ఈ ఏడాది తొలి విజయం ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఇండియా, బలమైన ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరగనుండగా.. 14 నెలల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీపైనే అందరి దృష్టి నిలిచింది. ఈ పోరులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని జట్టు ఆశిస్తుండగా.. వచ్చే నెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీ లయ అందుకోవాలని చూస్తున్నాడు.
షమీ చివరగా 2023 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగాడు. ఆ టోర్నీలో 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన టీ20 కెరీర్‌లోనూ షమీ 24 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇప్పటిదాకా 23 టీ20లు మాత్రమే ఆడిన షమీ.. చివరగా 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇదే ఇంగ్లండ్‌పై బరిలోకి దిగాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత రంజీ మ్యాచ్, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజయ్ హజారే వన్డే ట్రోఫీలో బరిలోకి దిగి ఫిట్‌నెస్ సాధించిన వెటరన్ పేసర్.. ఈ పోరులో సత్తా చాటి తన బౌలింగ్‌లో పదును తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ అతనికి కీలకం కానుంది. ఇక, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టెస్టు జట్టు ఆస్ట్రేలియా టూర్ ఘోర పరాజయంతో నిరాశతో ఉన్న అభిమానులను అలరించాల్సిన బాధ్యత ఇప్పుడు ఇండియా టీ20 జట్టుపై ఉంది. ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌కు అనుకూలం కాగా... ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ పోరులో పరుగుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
అక్షర్, శాంసన్‌పైనా ఫోకస్
షమీతో పాటు ఈ సిరీస్‌లో మరో ఇద్దరిపైనా ఫోకస్ ఉండనుంది. కొత్తగా షార్ట్ ఫార్మాట్ వైస్ కెప్టెన్సీ అందుకున్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈ సిరీస్‌లో కీలకం కానున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ఆటతో ఆకట్టుకున్న అక్షర్‌కు రివార్డుగా మేనేజ్‌మెంట్ జట్టు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. ఇక, చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన కేరళ స్టార్ సంజూ శాంసన్ తన కెరీర్‌లో కీలక దశలో ఉన్నాడు. మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనూ కేరళ సెలెక్టర్లు అతడిని పక్కనబెట్టారు. ఇది వరకు కూడా ఇలాంటి కష్టమైన సందర్భాల్లో శాంసన్ తన మార్కు చూపెట్టాడు.
సౌతాఫ్రికాతో గత టీ20 సిరీస్‌లో వరుసగా రెండు టీ20 సెంచరీలు కొట్టి ఔరా అనిపించాడు. ఈ సిరీస్‌లోనూ అతను మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నాడు. శాంసన్ మాదిరిగా సౌతాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలు చేసిన తిలక్ వర్మ మరోసారి తన బ్యాట్ పవర్ చూపెట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఇక, బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో సత్తా చాటి మంచి పేరు తెచ్చుకున్న తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి షార్ట్ ఫార్మాట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండటంతో తుది జట్టులో అతనికి అవకాశం వస్తుందో లేదో చూడాలి.
ఇంగ్లండ్ కొత్త ఆరంభం కోసం..
గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఫెయిలైన జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో కొత్త అధ్యాయాన్ని మొదలెట్టనుంది. దూకుడైన ‘బాజ్‌బాల్’ ఆటతో టెస్ట్ క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు చేసిన మెకల్లమ్ ఇప్పుడు షార్ట్ ఫార్మాట్‌లోనూ ఆ విజయాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నించనున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన న్యూజిలాండ్ గ్రేట్ మెకల్లమ్‌కు ఈడెన్ గార్డెన్స్‌పై మంచి పట్టుంది. కానీ, ఇంగ్లిష్ టీమ్ తమ కీలక ప్లేయర్లయిన రీస్ టాప్లీ, సామ్ కురన్, విల్ జాక్స్ సేవలను కోల్పోయింది.
అయితే గత వన్డే సిరీస్‌లో విండీస్‌పై మెరిసిన 21 ఏండ్ల జాకబ్ బెథెల్‌పై ఇండియా గడ్డపై మెరవాలని చూస్తున్నాడు. న్యూజిలాండ్‌పై టెస్టుల్లో వరుస సెంచరీలతో జోరు మీదున్న హ్యారీ బ్రూప్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. టెస్టు ఓపెనర్ బెన్ డకెట్ ఆరేండ్లలో తొలిసారి షార్ట్ ఫార్మాట్‌లో బరిలోకి దిగుతున్నాడు. షమీ మాదిరిగా గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇస్తున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై కూడా అందరి దృష్టి ఉంది.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లిష్ టీమ్ పేస్ ఎటాక్‌ను తను ముందుండి నడిపించనున్నాడు.ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. ఇటీవలే మోచేయి గాయం నుంచి కోలుకున్న పేస్ బౌలర్ మార్క్ వుడ్ కూడా బరిలోకి దిగుతున్నాడు. నాణ్యమైన బౌలర్లతో పాటు బట్లర్, బ్రూక్, ఫిల్‌సాల్ట్, లివింగ్‌స్టోన్ వంటి హిట్టర్లతో కూడిన ఇంగ్లండ్‌ను ఇండియా ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదు.
పిచ్/వాతావరణం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. 200 ప్లస్ స్కోరును కూడా కాపాడుకోవడం కష్టం. రాత్రి పూట మంచు బౌలర్లపై ప్రభావం చూపనుంది. టాస్ నెగ్గే జట్టు తొలుత బౌలింగ్‌కే మొగ్గు చూపొచ్చు. వర్ష సూచన లేదు.
జట్లు
ఇండియా (అంచనా) : సంజూ శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ.
ఇంగ్లండ్ : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.