ప్రతివారంలాగే ఈ శుక్రవారం (జనవరి 24న) కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అందులో అన్ని సినిమాలు చిన్న బడ్జెట్తో తెరకెక్కినవే. అయినప్పటికీ, క్రైమ్, ఎమోషన్, థ్రిల్లర్ జోనర్లో వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.
అయితే, గత వారం సంక్రాంతి సినిమాలతో బాక్సాఫీస్ జోరు చూపించింది. ప్రస్తుతం డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు థియేటర్స్లో తమ సత్తా చాటుతున్నాయి. మరి ఈ పెద్ద సినిమాల నడుమ ఈ చిన్న సినిమాలు ఎలా తట్టుకోనున్నాయో చూడాలి.
గాంధీ తాత చెట్టు:
దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్ రోల్‌లో పద్మావతి మల్లాది తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు నిర్మించాయి.
ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం శుక్రవారం జనవరి 24న విడుదల కాబోతోంది. ‘మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించే ఓ చిన్నారి తన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనేది కథ.
ఇందులో గాంధీ పాత్రకు సుకృతి పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ సినిమా కోసం తను నిజంగానే గుండు చేయించుకుని డేరింగ్ డెసిషన్ తీసుకుంది. మెసేజ్‌తో పాటు కమర్షియాలిటీ ఉన్న సినిమా ఇది.
డియర్ కృష్ణ:
అక్షయ్, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు జంటగా దినేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. ఐశ్వర్య మరో హీరోయిన్. పీఎన్ బలరామ్ ఈ కథను రాసి, చిత్రాన్ని నిర్మించారు. జనవరి 24న సినిమా విడుదల కానుంది.
మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒకరికి రూ.10,000 క్యాష్ బ్యాక్ ఇవ్వబోతున్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. వారం రోజుల పాటు ఇది కొనసాగుతుందన్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ఇన్సిడెంట్ స్ఫూర్తితో దీన్ని సినిమా తెరకెక్కించారు.
హత్య:
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘హత్య’. శ్రీవిద్య బసవ దర్శకత్వంలో ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. శుక్రవారం జనవరి 24న సినిమా రిలీజ్ కానుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ లో రానుంది. టీజర్, ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకున్నాయి.
తల్లి మనసు:
దర్శకుడిగా యాభైకి పైగా సినిమాలు చేసిన ముత్యాల సుబ్బయ్య.. తన కొడుకు అనంత కిషోర్‌ను నిర్మాతగా పరిచయం చేస్తూ తన సమర్పణలో రూపొందించిన చిత్రం ‘తల్లి మనసు’. ఆయన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య లీడ్ రోల్స్‌లో నటించారు. తల్లి లేకుండా ప్రపంచమే లేదు. అలాంటి తల్లి భావోద్వేగం, తపనను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించినట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ మూవీ జనవరి 24న విడుదల కానుంది.
ఐడెంటిటీ:
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, స్టార్ హీరోయిన్ త్రిష నటించిన లేటెస్ట్ మూవీ ఐడెంటిటీ. ఈ మూవీ జనవరి 24న రిలీజ్ కానుంది. ఇన్వెస్టిగేషన్ జోనర్ లో వస్తోన్న ఈ మూవీకి మలయాళ ప్రేక్షకులు నుంచి అద్దిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది.
హాంగ్ కాంగ్ వారియర్స్
చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ‘హాంగ్ కాంగ్ వారియర్స్’ జనవరి 24న రిలీజ్ కానుంది. ఈ సినిమాని సౌత్‌లో ఎన్వీఆర్ సినిమాస్ సంస్థ జనవరి విడుదల చేయనుంది. హాంగ్ కాంగ్ సినీ చరిత్రలో వెయ్యి కోట్లు వసూలు చేసిన ఈ చిత్రంలో లూయిస్ కూ, సమ్మో కామ్-బో హంగ్, రిచీ లీడ్ రోల్స్ నటించారు.ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌కి సోయ్ చీయాంగ్ దర్శకత్వం వహించాడు.
స్కైఫోర్స్:
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్కైఫోర్స్’ (SkyForce). వింగ్ కమాండర్‌గా అక్షయ్ కనిపించనున్నారు. భారతదేశ తొలి వైమానిక దాడి ఆధారంగా సందీప్ కేవ్లానీ ఈ సినిమాని రూపొందించారు. శుక్రవారం 24న విడుదల కానుంది.