స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్.!

స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్.!
  • ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక
  • మండలం యూనిట్​గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు
  • రెండు రోజుల్లో  కలెక్టర్లకు రిపోర్ట్​ పంపనున్న సర్కార్
  • జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు 
  • ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల.. అనంతరం ఎన్నికల షెడ్యూల్
  • షెడ్యూల్​ విడుదలైన15 రోజుల వ్యవధిలో పోలింగ్ 
  • రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు చాన్స్

హైదరాబాద్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్​ రిలీజ్​ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్​ కమిషన్​ తన రిపోర్ట్​ను సోమవారం ప్రభుత్వానికి అందజేసింది. ఈ రిపోర్ట్​ను కేబినెట్​ఆమోదించి.. జిల్లాల కలెక్టర్లకు పంపించనుంది. కలెక్టర్లు నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాలవారీగా వార్డులకు.. మండలాలవారీగా సర్పంచ్​లకు, ఎంపీటీసీ స్థానాలకు.. జిల్లాలవారీగా ఎంపీపీ, జెడ్పీటీసీ​స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.

అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు. ఈ ప్రాసెస్ పూర్తవగానే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలవుతుంది. ఆ తర్వాత గెజిట్​ను  స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తే.. వెనువెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఈ ప్రక్రియంతా వారంలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. 

700 పేజీల రిపోర్ట్​

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన  దాదాపు 700 పేజీల రిపోర్ట్​ను సీఎస్​ శాంతికుమారికి డెడికేటెడ్​ కమిషన్​ చైర్మన్​ బూసాని వెంకటేశ్వర్​రావు సోమవారం సెక్రటేరియెట్​లో అందజేశారు. అనంతరం ఆ నివేదికను సీఎస్​ శాంతి కుమారి ద్వారా సీఎం రేవంత్​ రెడ్డికి చేరింది. కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50 శాతం రిజర్వేషన్లను డెడికేటెడ్​ కమిషన్​ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇందులోనూ 50% మహిళలకు కేటాయిస్తారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 27శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా..  దాదాపు 23 శాతం బీసీలకు దక్కాయి. 

ఈసారి కూడా బీసీలకు 22 నుంచి 23 శాతం దక్కుతాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్​ కమిషన్ ను కచ్చితంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2021లోనే ఆదేశించింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్​ కమిషన్​ను ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 2011  జనాభా లెక్కల వివరాలు అందుబాటులో ఉండగా.. బీసీలకు సంబంధించిన లెక్కలు లేవు. దీంతో ప్రభుత్వం కులగణన చేపట్టింది. కులగణన ద్వారా రాష్ట్రంలో 56.33శాతం బీసీలు ఉన్నట్లు లెక్క తేల్చి, ఆ వివరాలను డెడికేటెడ్​ కమిషన్​కు అందించింది. 

ఈ నివేదికలో గ్రామాలవారీగా బీసీ లెక్కలు ఉన్నట్లు తెలిసింది. దీంతో వాటి ఆధారంగా  ఏయే వార్డులను, ఏయే పంచాయతీలను, ఏయే మండలాలను బీసీలకు కేటాయించాలో  కమిషన్​ సిఫార్సు చేసినట్లు తెలిసింది. వాటి ఆధారంగానే సర్పంచ్​, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్ పర్సన్​ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.  

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి

రిజర్వేషన్లు 50శాతం దాటరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు తగ్గట్టు డెడికేటెడ్​ కమిషన్​ నివేదికను రెడీ చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10శాతం మినహాయిస్తే.. బీసీలకు 22 నుంచి 23శాతం రిజర్వేషన్లను డెడికేటెడ్​ కమిషన్​ సిఫార్సు చేసినట్లు తెలిసింది. అలాగే, బీసీ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో పేర్కొంది. కమిషన్​ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్ల కోసం మండలాన్ని యూనిట్​గా తీసుకున్నారు. ఇక వార్డుల రిజర్వేషన్లు గ్రామం యూనిట్​గా ఖరారు చేయాలని  పేర్కొన్నారు. 

ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను జిల్లా యూనిట్​గా, కీలకమైన జెడ్పీ చైర్​పర్సన్ స్థానాలను రాష్ట్ర యూనిట్​గా  తీసుకుని రిజర్వేషన్లు ఫైనల్​ చేయాలని డెడికేటెడ్​కమిటీ సూచించినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్​ చేసిన కులగణన నివేదికను డెడికేటెడ్​ కమిషన్​పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 12,848  పంచాయతీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలు, 570 జెడ్పీటీసీ స్థానాలు, 32  జెడ్పీలు ఉన్నాయి. ఈ లెక్కన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు (28శాతం)పోగా.. బీసీలకు 2,500 నుంచి 3,500 గ్రామాల్లో సర్పంచ్​ పదవులు, 1,000 నుంచి 1,300 దాకా ఎంపీటీసీ స్థానాలు.. 100 నుంచి 130 దాకా జెడ్పీటీసీ స్థానాలు, 6 నుంచి 8 దాకా జెడ్పీ చైర్​పర్సన్​ పదవులు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. 

మూడు నెలల పాటు కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం నిరుడు నవంబర్​లో బీసీ డెడికేటెడ్​ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కమిషన్‌‌కు చైర్మన్‌‌గా రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ అధికారి బూసాని వెంకటేశ్వరరావును, సభ్య కార్యదర్శిగా బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బి.సైదులును నియమించింది. నెలరోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. కానీ, డెడికేటెడ్‌‌ కమిషన్‌‌ దాదాపు మూడు నెలలపాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై కసరత్తు చేసింది. ఈ క్రమంలో కమిషన్​ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి.. 

బీసీ సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. గతంలో నియమించిన బీసీ కమిషన్లు సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కమిషన్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు, ప్రముఖులు, కీలక వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు గణాంకాలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేటర్లు సేకరించిన కులగణన డేటాను  ప్లానింగ్ డిపార్ట్‌‌మెంట్ నుంచి బీసీ డెడికేటెడ్ కమిషన్‌‌ సేకరించింది. ఈ సమాచారాన్నంతటినీ క్రోడీకరించిన కమిషన్..​తన సిఫార్సులతో  నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 

ఇక, మున్సిపల్ రిజర్వేషన్లపై కమిషన్ ఫోకస్

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక అందజేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్.. ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కొత్త, పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర వివరాలు(విలీన గ్రామాలతో పాటు) పదిరోజుల్లో అందజేయాలని మున్సిపల్​శాఖను కోరింది. గతంలో జరిగిన ఐదు ఎన్నికల ఫలితాలు, రిజర్వేషన్ల వివరాలు కూడా కావాలని అడిగింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో 154 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆయా వార్డులు, డివిజన్లవారీగా కులాలవారీ లెక్కలను ప్లానింగ్​ డిపార్ట్​మెంట్​నుంచి డెడికేటెడ్​​కమిషన్​ఇప్పటికే తీసుకుంది. దీంతో వీటన్నింటినీ అధ్యయనం చేసి 20 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిషన్ వర్గాలు వెల్లడించాయి.

ఏ ఎన్నిక ముందు..? 

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా..? అనేది హాట్ టాపిక్​గా మారింది. ఈ రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్నదానిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాలేదని.. కాకపోతే ఏ ఎన్నికకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలున్నాయని అధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో రెండు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా.. రంగంలోకి దిగనున్నారు. 

ఎన్నికల షెడ్యూల్​ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించే చాన్స్ ఉంది. గతంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరపగా.. ఈ సారి మాత్రం రెండు విడతల్లో ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిరుడు ఫిబ్రవరి 1న సర్పంచ్​ల పదవీకాలం ముగిసి, గ్రామాల్లో  ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్నది. పదవీకాలం గడువు ఆరు నెలలు ముందుగానీ, పదవీకాలం ముగిసిన ఆరునెలల లోపుగానీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రభుత్వం రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు, ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.