న్యూ ఇయర్​ మార్పు తెచ్చేనా?

న్యూ ఇయర్​ మార్పు తెచ్చేనా?

2025 నూతన సంవత్సర వేడుకలు నేటి నుంచి  ప్రపంచవ్యాప్తంగా షురూ కానున్నాయి.  1582లో రోమన్‌‌‌‌ క్యాథలిక్‌‌‌‌ చర్చ్‌‌‌‌ ‘పోప్‌‌‌‌ గ్రిగోరీ’ స్థాపించిన గ్రిగోరియన్‌‌‌‌ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా 31 డిసెంబర్‌‌‌‌, 1 జనవరి రోజుల్లో గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ,  నూతన సంవత్సరానికి ఆహ్వానం తెలపడం జరుగుతున్నది.  నూతన సంవత్సర ప్రారంభం రోజు ప్రభుత్వ సెలవు కానప్పటికీ ఇండియాలోనూ   నూతన సంవత్సర వేడుకలు  పరిపాటిగా మారిపోయాయి.భారతదేశవ్యాప్తంగా 1.42 బిలియన్ల జనులు చాంద్రమాన క్యాలెండర్‌‌‌‌ ప్రకారం  తమ నూతన సంవత్సర వేడుకలు, పండుగలను  నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. తెలుగు, కన్నడ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ‘ఉగాది పండుగ’ రూపంలో జరుపుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సర  వేడుకలతో పాటు ‘గ్రిగోరియన్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌’ ప్రకారం 1 జనవరి రోజున కూడా న్యూ ఇయర్‌‌‌‌ డే జరుపుకుంటున్నారు.

సత్కార్యాలపై తీర్మానాలు 

న్యూఇయర్​ వేడుకల సంస్కృతి పెరిగిపోవడం మనం గమనిస్తున్నాం.  పలు సందర్భాల్లో  కొన్ని ప్రాంతాల్లో పరిధి దాటడం శోచనీయం.  నూతన సంవత్సర వేడుకల నిర్వహణను అందరూ ఆహ్వానించే రీతిలో చేయాలి.  న్యూ ఇయర్​ వేడుకలను  ఘనంగా జరుపుకుంటూనే  సేవా కార్యక్రమాలపై తగిన శ్రద్ధ చూపాలి.  భవిష్యత్తు  మరింత బాగుండాలని ఆశావహ దృక్పథంతో  ప్రణా ళికలను ప్రతి ఒక్కరూ రూపొందించుకోవాలి.  2024లో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ, 2024 వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి.  2025లో మనం చేపట్టవలసిన కార్యాలను నిర్ణయించుకొని, నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధనకు ఇంగ్లీష్​ కొత్త సంవత్సరాన్ని గీటురాయిగా తీసుకుంటారు.  న్యూ ఇయర్​  దేశప్రగతిలో  ఉన్నతమైన మార్పు తీసుకురావాలని ఆశిద్దాం.

సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలి

పొరుగింటి పుల్ల కూర రుచిగానే ఉంటుందనేది నానుడి. అయితే,  మన సంస్కృతీ సంప్రదాయాలను  కాపాడుకుంటూనే ఇతర దేశాల  వేడుకల్లో సహితం పాల్గొందాం.  మన మహానగరాలు ఢిల్లీ, ముంబయి, కోల్‌‌‌‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​ లాంటి నగరాల వీధులు 31 డిసెంబర్‌‌‌‌  రాత్రి యువతతో  నిండిపోతాయి.  బాణసంచా కాల్చుతూ సంబురాలు చేసుకోవడం జరుగు
తోంది.  అయితే,  హద్దులు దాటి అతిగా ఆల్కహాల్‌‌‌‌ సేవించి వాహనాలు నడపడం లేదా నడి వీధుల్లో  నృత్యాలు చేయడం,  పబ్బుల్లో  ఛీత్కార పనులు చేయడం లాంటివి సరికాదు.  పండుగలు,  పర్వదినాలు, వేడుకలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలి. ఇతరులు ఇబ్బందులను ఎదుర్కొనేలా ప్రవర్తించడం తగదు.  న్యూ  ఇయర్​ వేడుకల్లో ప్రధానంగా యువత   సంయమనంతో వ్యవహరించాలి.  కొత్త సంవత్సరంలో  ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరాలని  కోరుకుందాం. 

-  డా. బుర్ర మధుసూదన్ రెడ్డి