సంక్రాంతి అంటేనే తెలుగువారి పెద్దపండుగ. కుటుంబమంతా కలిసి మూడు రోజుల పాటు చేసుకునే ముచ్చటైన పండుగ. ఆట పాటలు, ముగ్గులు, పందెం కోళ్ల పోటీలు, థియేటర్లో అభిమాన నటుల సినిమాలు.. ఇలా చాలా రకాలైన సరదాలతో జరుపుకునే పండుగ ఇది. అయితే, ఈ పండుగ పూట కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు అయితే వేరే లెక్క.
తెలుగు ప్రేక్షకులు పెద్ద సినిమాల కోసం, చిన్న సినిమాల ఫ్యామిలీ డ్రామా కోసం నెలల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుందంటే చాలు.. అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్, ఫ్రెండ్స్ తో మీటింగ్స్ ఇలా అపుడు ఉండే ఆ సందడే వేరు. మరి ఈ 2025 సంక్రాంతికి థియేటర్లో రిలీజ్ కానున్న సినిమాలేంటీ? తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏమైనా సినిమాలు వస్తున్నాయా? అనేది ఓ లుక్కేద్దాం.
తెలుగు సినిమాలు:
1. గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. విలక్షణ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
Also Read : సంక్రాంతి సినిమాలతో కమ్ బ్యాక్ ఇస్తా
2. డాకు మహారాజ్
బాలకృష్ణ హీరోగా ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించిన మూవీ డాకు మహారాజ్.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.బ్యూటిఫుల్ హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఉర్వశి రౌతేలా (బాలీవుడ్) బాలయ్యకి జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. బాలయ్య కెరీర్‌లో ఇది 109వ చిత్రం. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ యాక్షన్ సీన్స్, బలమైన భావోద్వేగాలతో డాకు మాన్ సింగ్ నిజ జీవిత నేపథ్యంలో తెరకెక్కింది.
3. సంక్రాంతికి వస్తున్నాం
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్. సంక్రాంతి కానుకగా జనవరి14న సినిమా రిలీజ్ కానుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. థియేటర్స్ లో ఫ్యామిలీస్‌కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లో ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
తమిళ సినిమాలు:
1. మదగజరాజా
హీరో విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ జోడీగా రూపుదిద్దుకున్న సినిమా మదగజరాజా. దాదాపు 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. జనవరి 12న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ సి దర్శకత్వం వచించాడు.
2. కాదలిక్క నేరమిల్లై
నటుడు జయం రవి హీరోగా రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కాదలిక్క నేరమిల్లై. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించింది. యోగి బాబు, వినయ్ రాయ్, జాన్ కొక్కెన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జనవరి 14 రిలీజ్ కానుంది.
3. నేసిప్పాయ
విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ నెసిప్పాయ. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. అదితి శంకర్, ఆర్. శరత్‌కుమార్, ప్రభు, ఖుష్బు, ఆకాష్ మురళి ప్రధాన పత్రాలు పోషించారు. నెసిప్పాయ జనవరి 14, 2025న థియేటర్లలోకి రానుంది. XB ఫిల్మ్ క్రియేటర్స్ నేసిప్పాయ సినిమాను నిర్మించింది.
4. వనంగాన్
ప్రముఖ స్టార్ డైరెక్టర్ బాల తెరకెక్కించిన మూవీ వనంగాన్. రోష్ని ప్రకాష్, మిస్కిన్, సముద్రఖనితో పాటు అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో మమిత బైజు మరియు జార్జ్ మరియన్ కూడా నటించారు.అయితే ఈ వనంగాన్ మూవీకి మొదట్లో సూర్య మరియు కృతి శెట్టి నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.
5. మద్రాస్కారన్
మద్రాస్‌కారన్ వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన తమిళ యాక్షన్ చిత్రం. ఈ సినిమాతో మలయాళ నటుడు షేన్ నిగమ్ తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నిహారిక కొణిదెల, ఐశ్వర్య దత్తా, కరుణాస్ మరియు పాండియరాజన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. షేన్ నిగమ్ మరియు కలైయరసన్ ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జగదీష్ బి నిర్మించారు. మద్రాస్‌కారన్ జనవరి 10, 2025న థియేటర్లలోకి రానుంది.
మలయాళ సినిమాలు:
1. రేఖాచిత్రం
రేఖచిత్రం మూవీని జోఫిన్ టి. చాకో తెరకెక్కించాడు. ఇందులో ఆసిఫ్ అలీ మరియు అనశ్వర రాజన్ నటించారు. జాన్ మంత్రికల్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రాన్ని వేణు కున్నప్పిల్లి మరియు ఆంటో జోసెఫ్ నిర్మించారు. ఇందులో జరీన్ షిహాబ్, మనోజ్ కె జయన్ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ మూవీ జనవరి 9, 2025న విడుదల కానుంది.
కన్నడ సినిమాలు:
1. సంజు వెడ్స్ గీత
కన్నడ లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సంజు వెడ్స్ గీత 2. నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీనగర్ కిట్టి మరియు రచితా రామ్ నటించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీధర్ వి సంభ్రమ్. సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే, ఎడిటింగ్: ఆంథోని. నాగశేఖర్ మూవీస్ ప్రొడక్షన్స్, మహానటి క్రియేషన్స్ పతాకాలపై చలవాడి కుమార్, మాపి నారాయణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.