
కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువతి పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం ప్రయత్నించి, సైబర్ కేటుగాడి చేతిలో మోసపోయింది. బాధితురాలు దఫాల వారీగా డబ్బులు పంపిస్తూ రూ.2.03 లక్షలు కోల్పోయింది. ఈ విషయమై స్థానిక పోలీసులకు శనివారం బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఈడీ చదివిన సదరు యువతి ఉద్యోగం కోసం కొన్ని రోజులుగా ఆన్ లైన్ లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తన ఇన్ స్టాగ్రాంకు వచ్చిన లింక్ ను క్లిక్ చేసింది.
ఉద్యోగ విషయమై చాటింగ్ చేస్తూ 4 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఆమె ఖాతాలో రూ.1300 జమయ్యాయి. దాంతో ఆమెకు నమ్మకం కలిగి వేలల్లో డబ్బులు పంపించ సాగింది. గత డిసెంబర్ 28 నుంచి ఈనెల 1 వరకు ఆమె రూ.2.03 లక్షలు పంపింది. తీరా ఎలాంటి స్పందన రాకపోవడంతో 1930కు నంబరు కాల్ చేసి చెప్పడంతో రూ.61,270 ఫ్రీజ్ అయ్యాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొమురవెల్లి ఎస్సై నాగరాజు తెలిపారు.