తెలంగాణ పోలింగ్‌ : 11 గంటల వరకు 20.64 శాతం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా  కొనసాగుతుంది.  కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు 20.64 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు . అత్యధికంగా  అదిలాబాద్ లో 30. 65 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం నమోదైంది.  మధ్యాహ్నం తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఈసీ భావిస్తోంది.

 ఇక హైదరాబాద్ లో అయితే ఓటింగ్ మందకోడిగా సాగుతుంది.   ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయితే 10 గంటల వరకు.. అంటే 3 గంటల్లో కేవలం 5 శాతం మాత్రమే నమోదైంది. కొన్ని పోలింగ్ బూతుల్లో తప్పితే.. చాలా పోలింగ్ కేంద్రాల్లో క్యూలు లేవు. నేరుగా వెళ్లి ఓటేసి వచ్చేంత ఖాళీగా ఉన్నాయి.  

అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం పోలింగ్ నమోదు కాగా సనత్ నగర్ లో 1.2 శాతం, కూకట్ పల్లిలో 1.9 శాతం.. మేడ్చల్ లో 2 శాతం.. గోషామహల్ లో 2 శాతం.. చార్మినార్ లో 3 శాతం.. ముషీరాబాద్ లో 4 శాతం.. రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోదైంది.