సెల్ఫ్​ డ్రైవ్ బిజినెస్ ​పేరిట ​21 కార్లు మాయం

సెల్ఫ్​ డ్రైవ్ బిజినెస్ ​పేరిట ​21 కార్లు మాయం
  • నలుగురిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు
  •  నిందితుల్లో మహిళే ప్రధాన సూత్రధారి

గచ్చిబౌలి, వెలుగు: సెల్ఫ్  డ్రైవింగ్ ​బిజినెస్ పేరిట ఓనర్ల దగ్గర కార్లను లీజుకు తీసుకుని మోసం చేస్తున్న ఓ ముఠాను రాయదుర్గం పోలీసులు అరెస్ట్​చేశారు. నిందితుల నుంచి రూ. 2.50 కోట్ల విలువైన 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సోమవారం మాదాపూర్ జోన్​ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్​తో కలిసి మాదాపూర్​డీసీపీ వినీత్​ మీడియాకు వెల్లడించారు. 

గచ్చిబౌలి టెలికాంనగర్​కు చెందిన జూపూడి ఉష ఈజీ మనీ కోసం కార్ల సెల్ఫ్ డ్రైవ్ బిజినెస్​పేరిట చీటింగ్​చేసేందుకు ప్లాన్​చేసింది. ఇందులో భాగంగా షేక్​పేట్​కు చెందిన తుడుముల -మల్లేశ్​తో కలిసి కార్లను అద్దెకు తీసుకుంటామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. దాంతో పలువురు తమ సొంత కార్లను వీరికి రోజువారీ అద్దె కోసం అప్పజెప్పారు. బీదర్ నుంచి సిటీకి వచ్చి అత్తాపూర్​లో ఉంటున్న సాగర్ పాటిల్, బల్కీ నుంచి వచ్చి అత్తాపూర్​లో ఉంటున్న అనిల్​కు కమిషన్​తీసుకుని కార్లను అప్పజెప్పేవారు. 

అలా మొత్తం 21 కార్లను బీదర్, కర్నాటకలోని బల్కీ జిల్లాలకు తరలించి కార్లలో జీపీఎస్ తొలగించి అద్దెకు తిప్పేవారు. కార్లు ఇచ్చిన ఓనర్లకు అందుబాటులో ఉండకుండా మొబైల్ నంబర్లు మార్చి తప్పించుకు తిరిగేవారు. ఎవరైనా పట్టుకుని, అద్దె గురించి అడిగితే చోరీకి గురయ్యాయని చెప్పి తప్పించుకునేవారు. దీంతో కొంతమంది బాధితులు మోసపోయామని గ్రహించి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఉషా, మల్లేశ్, సాగర్, అనిల్​ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి -4 మహీంద్రా థార్, 10 మారుతీ ఎర్టిగా, ఒక ఇన్నోవా, మూడు మారుతీ స్విఫ్ట్, ఒక హ్యుందాయ్ వెన్యూ, ఒక హ్యుందాయ్ ఐ20, ఒక గ్రాండ్ ఐ10కార్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు.