శ్రీలంకలో 21మంది భారతీయులు అరెస్టు అయ్యారు. ద్వీప దేశంలో సడలించిన పర్యాటక వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. అక్రమంగా ఆన్‌లైన్ మార్కెటింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నందుకు 21 మంది భారతీయులను శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన భారతీయులందూ 24 నుండి 25 సంవత్సరాల వయస్సు గల యువకులేనని అధికారులు తెలిపారు.
ప్రాథమిక విచారణ తర్వాత.. నెగోంబోలో ప్రముఖ వెస్ట్రన్ కోస్ట్ రిసార్ట్ టౌన్ లోని అద్దె ఇంటిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు చేసి.. అరెస్టైన ఇండియన్స్, అక్కడ అక్రమంగా ఆన్‌లైన్ మార్కెటింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కంప్యూటర్లు, ఇతర పరికరాలను అధికారులు సీజ్ చేశారు. వీరంతా పర్యాటక వీసాలపై ఫిబ్రవరి, మార్చిలో శ్రీలంకకు వచ్చినట్లు సీనియర్ ఇమ్మిగ్రేషన్ అధికారి చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకు అరెస్టయిన భారతీయులను వెలిసరలోని డిపార్ట్‌మెంట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు దృష్టి పెట్టిన శ్రీలంక ప్రభుత్వం.. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 31 వరకు ఇండియాతోపాటు కొన్ని దేశాల పౌరులు విసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు అనుమతిస్తూ శ్రీలంక నిర్ణయం తీసుకుంది. ద్వీప దేశం కావడంతో పలు దేశాల పౌరులు శ్రీలంకలో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తారు. కాగా, శ్రీలంకకు పర్యాటక రంగం నుంచే ఎక్కువ ఆదాయం లభిస్తుంది.