చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బీజింగ్ లోని చాంగ్‌ఫెంగ్ హాస్పిటల్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు. మంగళవారం (ఏప్రిల్ 18వ తేదీ) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చాంగ్‌ఫెంగ్ ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
ఫెంగ్‌టై జిల్లాలోని బీజింగ్ చాంగ్‌ఫెంగ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రిలోని 71 మంది రోగులను ఖాళీ చేసి, సురక్షిత ప్రదేశానికి తరలించారు.
అత్యవసర చికిత్స కోసం బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు...? వంటి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్పత్రిలో ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ప్రమాదం నుంచి బయటపడేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించారు. మరికొందరు తాళ్ల సహయంతో కిందకు దూకారు.