భారత్​ కు 21 మిలియన్​ డాలర్ల ఫండ్​ నిలిపివేసిన అమెరికా

భారత్​ కు 21 మిలియన్​ డాలర్ల ఫండ్​ నిలిపివేసిన అమెరికా
  • భారత్​లో ఓటింగ్ పెంచేందుకు అమెరికా నిధులు..
  • రద్దు చేసిన డోజ్​ చీఫ్ మస్క్
  • 21 మిలియన్ డాలర్ల ఫండింగ్ నిలిపివేత  
  • బంగ్లాదేశ్​లో రాజకీయ వ్యవస్థ బలోపేతం నిధులూ కట్ 
  • కాంగ్రెస్ హయాంలోనే అమెరికా ఫండింగ్ షురువైందన్న బీజేపీ


న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకంటూ అమెరికా ప్రభుత్వం కేటాయించిన నిధులను బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డిపార్ట్​మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్​) నిలిపివేసింది. ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన డబ్బుల వినియోగంలో వృథాను అరికట్టడంపై దృష్టిపెట్టిన డోజ్ వరుసగా విదేశాలకు నిధుల సాయాన్ని నిలిపివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకని గత బైడెన్ సర్కారు కేటాయించిన 21 మిలియన్ డాలర్ల(రూ.182 కోట్లు) నిధులను డోజ్​ రద్దు చేసింది. 

విదేశాల్లో ఎన్నికలు, రాజకీయ ప్రక్రియ బలోపేతం కోసం నెలకొల్పిన కన్సార్టియంకు బైడెన్ సర్కారు మొత్తం 486 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఇందులో భాగంగా భారత్​కు కేటాయించిన నిధులను డోజ్ కట్ చేసింది. అలాగే బంగ్లాదేశ్​లో రాజకీయ వ్యవస్థ బలోపేతం కోసమని కేటాయించిన 29 మిలియన్ డాలర్ల నిధులనూ రద్దు చేసింది. 

వీటితోపాటు ఆసియాలో విద్యలో మెరుగైన ఫలితాల కోసం, నేపాల్​లో ఫెడరలిజం, బయోడైవర్సిటీ కోసం, ఆఫ్రికా, తదితర దేశాలకు సాయంకోసం కేటాయించిన మొత్తం 286 మిలియన్ డాలర్ల నిధులను నిలిపివేస్తున్నట్టు డోజ్ ప్రకటించింది. విదేశాల్లో రాజకీయ కార్యకలాపాల కోసం అమెరికా ప్రజల డబ్బును వృథాగా ఖర్చు చేయరాదని, తద్వారా ప్రభుత్వ సమర్థతను పెంచాలన్న ఉద్దేశంతోనే  రద్దు చేశామని స్పష్టం చేసింది.

ఇది భారత ఎన్నికల్లో విదేశీ జోక్యమే: బీజేపీ  

ఎన్నికల్లో ఓటింగ్ పెంచేందుకు అమెరికా సర్కారు నిధులు కేటాయించడం అనేది భారత ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమేనని బీజేపీ మండిపడింది. ‘‘ఓటింగ్ శాతం పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల నిధులా? ఇది కచ్చితంగా దేశ ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమే. దీనివల్ల ఎవరు లాభపడ్డారు? ఇప్పుడు రూలింగ్ పార్టీ మాత్రం కచ్చితంగా కాదు” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ అన్నారు. 

విదేశీ శక్తుల ద్వారా భారత సంస్థల్లో ఒక క్రమపద్ధతిలో జోక్యం జరిగిందన్నారు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా విదేశాల్లో రాజకీయాలను ప్రభావితం చేసేందుకు అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్​కు ఇందులో పాత్ర ఉందన్నారు. ‘‘మన దేశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, గాంధీలకు అనుచరుడిగా అందరికీ తెలిసిన జార్జ్ సోరోస్ జోక్యం చేసుకున్నారని దీనితో మరోసారి తేలిపోయింది” అని ఆయన ఆరోపించారు. ‘

2012లో ఎస్ వై ఖురేషీ చీఫ్ ఈసీగా ఉన్న సమయంలో జార్జ్ సోరోస్​కు చెందిన ఓపెన్ సొసైటీ సంస్థతో సంబంధం ఉన్న ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ సంస్థతో ఈసీ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సంస్థకు యూఎస్ ఎయిడ్ నుంచే నిధులు అందాయి. అప్పటి యూపీఏ సర్కారు దేశాన్ని బలహీనపర్చాలని అనుకునే శక్తుల చేతికి మన సంస్థలను అప్పగించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో పారదర్శకతపై ప్రశ్నించేవారు.. ఇలా మొత్తం ఈసీని విదేశీ శక్తులకు అప్పగించేందుకు వెనకాడకపోవడం విచారకరం’’ అని మాలవీయ ట్వీట్ చేశారు.