పాట్నా: బిహార్‌లో పిడుగుపడి 21 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఈ మరణాలు సంభవించాయని శుక్రవారం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ (సీఎంవో) వెల్లడించింది. అత్యధికంగా మధుబనిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, ఔరంగాబాద్‌లో నలుగురు, పాట్నాలో ఇద్దరు, రోహ్ తాస్, భోజ్ పుర్, కైమూర్, సరన్, జెహనాబాద్, గోపాల్ గంజ్, సుపాల్, లఖిసరాయ్, మాధేపురా జిల్లాల్లో ఒక్కరి చొప్పున మృతి చెందారని సీఎమ్ వో ఓ ప్రకటనలో తెలిపింది.
మృతుల కుటుంబాలకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంతాపం తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ జారీ చేసే సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. కాగా,బిహార్ లో గత కొన్ని వారాలుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఈ నెల ప్రారంభం నుంచి దాదాపుగా 70 మంది చనిపోయారు.