
- టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి
మరికల్, వెలుగు : జూరాల ఆర్గానిక్, అగ్రో ఇండస్ట్రీస్ ఏర్పడితే 21 గ్రామాలు పొల్యూటెడ్ అవుతాయని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి జి.హర్షవర్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని చిత్తనూర్గ్రామ పరిరక్షణ సమితి అధ్వర్యంలో ఇథనల్, సింథటిక్ కెమికల్ పరిశ్రమల దుష్ప్రభావాలపై ఆదివారం మరికల్‌లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. చిత్తనూర్ వద్ద 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమతో తాగు, సాగునీరు కలుషితం కావడంతో పాటు పంటలు పాడవుతాయన్నారు.
పరిశ్రమలో 70 అడుగుల లోతులో చెరువులను తవ్వుతున్నారని దీనివల్ల భూకంపం వచ్చే ప్రమాదం ఉందన్నారు. కంపెనీ చేపట్టొద్దని ఆరు నెలలుగా సర్కారు ఆఫీసుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని వాపోయారు. లీగల్‌గా కంపెనీ పనులను ఆపేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లామని చెప్పారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు రాములు, వెంకట్రామారెడ్డి, జోషి, ఆంజనేయులు, రాజు, గొల్ల కృష్ణయ్య పాల్గొన్నారు.