- ఈ ఏడాదిలో ఇప్పటికే 280 మంది కనిపిస్తలేరు..!
- కేసులు నమోదవుతున్నయ్.. జాడనే తెలియట్లే..
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో వ్యక్తుల మిస్సింగ్‌లు భయపెడుతున్నాయి. మిస్సింగ్ కేసులు ఏటా పెరుగుతున్నాయి.. తప్పిపోయినవారి ఆచూకీ కొనుక్కోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గత మూడేళ్లలో మొత్తం 2,135 మంది మిస్సింగ్ కాగా, ఇప్పటివరకు 1,312 మంది జాడ మాత్రమే తెలిసింది. మిగతా 923 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఈ ఏడాదిలో ఇప్పటికే 280 మంది కనిపించకుండా పోగా అందులో 70 మంది ఆచూకీ మాత్రమే లభించినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది.
తొందరపాటు నిర్ణయాల వల్లే చాలా మంది ఇల్లు వదిల వెళ్తున్నారు. మనస్తాపంతో, కలహాలతో వెళ్లిపోయిన వారు ఏళ్ల తరబడి కుటుంబాలకు టచ్‌లో రాకపోవడంతో చాల వరకు కుసులు కొలిక్కిరావడం లేదు. ఇంకొందరు మతిస్థిమితం కోల్పోయి అదృశ్యమవుతున్నారు. అలాంటివారి జాడ అసలు తెలియకుండా పోతోంది. ఈ పరిస్థితితో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ ఏడాదిలో కొన్ని ఘటనలు..
- మే 15న సంగారెడ్డి మండలం ఫసల్వాది తండాకు చెందిన కేతావత్ బుజ్జి అనే వివాహిత కనబడకుండా పోయింది. ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.
- మే 17న కంది మండలం కోయగుడ తండాకు చెందిన మెగావత్ సంతోష్ ఫీట్స్ తో బాధపడుతుండగా ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిపోయి తిరిగి రాలేదు.
- మే 24న నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కృష్ణకు సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామానికి చెందిన భోగిని సంగీతతో పదేళ్ల కింద పెళ్లి జరిగి ఇల్లరికం వచ్చాడు. తాగుడుకు బానిసైన కృష్ణ భార్యతో గొడవపడి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు.
- కంది మండలం కవలంపేట గ్రామానికి చెందిన సుమలత అనే వివాహిత ఇంట్లో ఉన్న తన సర్టిఫికెట్లు రూ.6 వేలు తీసుకొని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది.
- జూన్ 1న సంగారెడ్డి బాబానగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ప్రదీప్ కుమార్ పటాన్ చెరు మార్కెట్ కు వెళ్లి కనిపించకుండా పోయాడు.
- జూన్ 2న నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేటకు చెందిన 22 ఏళ్ల ఉదయ్ కిరణ్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
- జూన్ 6న పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన లక్ష్మి డయాలసిస్ చేసుకోవడానికి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి వచ్చి పోతిరెడ్డిపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్యాగు, సెల్ ఫోన్ అక్కడే వదిలేసి చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె జాడ తెలియలేదు.
- జూలై 6న రాయికోడు మండలం పిప్పడ్ పల్లి గ్రామానికి చెందిన అమృత్ ఆరోగ్య సమస్యలతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కనిపించకుండా పోయాడు.