పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత ఆలయానికి టెండర్ల ద్వారా రూ.2 కోట్ల 16లక్షల ఆదాయం వచ్చిందని దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, పాలక మండలి చైర్మన్ బాల గౌడ్, ఈఓ మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం ఏడుపాయల ఆలయ ఈఓ కార్యాలయంలో ఏడాది పాటు కొబ్బరికాయలు, ఒడి బియ్యాం, పూజ సామగ్రి విక్రయ హక్కుల కోసం టెండర్ నిర్వహించారు.
కొబ్బరి కాయలు, బోండాలు విక్రయించుకునే హక్కు కోసం 8 మంది పోటీపడ్డారు. ఇందులో మెదక్ పట్టణానికి చెందిన ధర్మకర్ లింగాజి రూ.1 కోటి 11లక్షలకు టెండర్కైవసం చేసుకున్నాడు. అలాగే దేవస్థానం వద్ద ఒడి బియ్యం పోగుచేసుకునే హక్కు నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందని నర్సింలు గౌడ్ రూ.86 లక్షల 50వేలకు, పూజ సామగ్రి విక్రయాల టెండర్ తిరుపతి రూ.18 లక్షల 50 వేలకు దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా వేలం పాటలు నిర్వహిస్తున్న సమయంలో టెండర్ దారుల మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, పాలక మండలి సభ్యులు మనోహర్, మోహన్ రావు, యాదయ్య, బాగారెడ్డి, ఆలయ సిబ్బంది మధుసూధన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్ శర్మ, ప్రతాప్ రెడ్డి, యాదగిరి, నర్సింలు, నరేశ్, వర్ణ చారి పాల్గొన్నారు.