ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారీగా 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఒక్క రోజులో కొత్తగా నమోదైన 218 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పేషెంట్ల సంఖ్య 5,247కు పెరిగింది. వారిలో 94 మంది కోలుకోవడంతో.. ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,869కి చేరింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 78కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వేర్వేరు కోవిడ్ ఆస్పత్రుల్లో 2,300 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,126 మంది లోకల్స్ కాగా, ఇటీవల విదేశాల నుంచి వెనక్కి తీసుకుని వచ్చిన వారు 188 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 933 మంది కరోనా బారినపడ్డారు. అయితే గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 136 మంది లోకల్స్, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 82 మంది ఉన్నారు. అలాగే డిశ్చార్జ్ అయిన వారిలో 72 మంది లోకల్స్ కాగా, 22 మంది ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వారు ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.