నస్పూర్, వెలుగు:సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒడ్డే ఓబన్న 218 వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నేరటి రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, వడ్డెర కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఒడ్డే ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా సంచార జాతులకు నాయకత్వం వహించాడని, గెరిల్లా యుద్ధ పద్ధతిలో పోరాటం చేశాడన్నారు. ప్రోగ్రాంలో సంబంధిత అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ ,వెలుగు : మహనీయుల చరిత్రను భావితరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఒడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వడ్డెర కుల సంఘ నాయకులు, ప్రముఖులతో కలిసి జ్యోతి వెలిగించి ఓబన్న ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.