- నామినేషన్లను ఉపసంహరించుకున్న 9 మంది అభ్యర్థులు
నల్గొండ అర్బన్, వెలుగు : నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నల్గొండ లోక్‌సభ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మాణిక్ రావు సూర్యవంశీ, ఎస్పీ చందనాదీప్తితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
నల్గొండ లోక సభ స్థానానికి మొత్తం 31 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, సోమవారం 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, దీంతో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తులు సైతం కేటాయించినట్లు తెలిపారు. మే 13న నిర్వహించే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
భువనగిరి బరిలో 39 మంది అభ్యర్థులు
యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్‌సభ స్థానంలో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉపసంహరించుకున్న వారు పోనూ పోటీలో 39 మంది ఉన్నారు. వీరిలో ఇండిపెండెంట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉన్నందున ఈవీఎంల అవసరం ఈ స్థానంలో ఎక్కువగా ఏర్పడింది. భువనగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా పలు రిజిస్ట్రర్డ్ ర్టీలతోపాటు ఇండిపెండెంట్లు కలిసి 61 మంది నామినేషన్లను దాఖలు చేశారు.
వీరిలో 9 మంది నామినేషన్లను స్క్రూటినీలో తిరస్కరించి, మిగతా 51 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల ఆఫీసర్లు తేల్చారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం కావడడంతో ముగ్గురు రిజిస్ట్రర్డ్పార్టీల అభ్యర్థులతోపాటు 9 మంది ఇండిపెండెంట్లు కలిపి మొత్తంగా 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 39 మంది ఉన్నారని ఎన్నికల ఆఫీసర్లు తేల్చారు.
పోటీలో ఉన్నది వీరే..
కాంగ్రెస్ నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్, సీపీఎం నుంచి ఎండీ జహంగీర్, బీఎస్సీ నుంచి ఐతరాజు అబేందర్తోపాటు మరో 16 మంది రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు, 18 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.