మూడు నగరాల్లో 22 హాట్ స్పాట్ సెంటర్లు

కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ సిటీల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు
ఎఫెక్టెడ్ ఏరియాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన ఆఫీసర్లు
లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలయ్యేలా చర్యలు

వెలుగు: కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లోని 22 ఏరియాలను ఆఫీసర్లు రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు, ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి ఈ సిటీలకు కరోనా అంటింది. వారితోపాటు వారి కుటుంబసభ్యులకు, వారితో క్లోజ్ గా కాంటాక్ట్ అయినవారిలోనూ కొందరికి పాజిటివ్ రావడంతో ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా ప్రకటించిన ఆఫీసర్లు కరోనా కంట్రోల్ కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఏరియాల్లో ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. నిత్యావసర సరుకులను ఇండ్లకే పంపిస్తున్నారు. కరీంనగర్, వరంగల్లో లాక్డౌన్ స్ట్రిక్ట్ గా అమలవుతున్నా నిజామాబాద్లో మాత్రం ప్రజలు బయట తిరుగుతున్నారు.

కరీంనగర్ సిటీలో రెండు ఏరియాలు
ఇండోనేషియా నుంచి వచ్చిన 10 మంది ద్వారా కరీంనగర్ కు కరోనా అంటుకుంది. మార్చి 14న సిటీకి వచ్చిన వారిని 16న గుర్తించి గాంధీకి తరలించారు. 10 మందికీ పాజిటివ్ రావడంతో నగరంలో వారు తిరిగిన ముకరంపుర, కాశ్మీర్ గడ్డప్రాంతాలను హాట్ స్పాట్స్గా గా ప్రకటించి, అందరినీ స్ట్రిక్ట్ గా హోం క్వారంటైన్ చేశారు. ఇండోనేషియా వారి నుంచి మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురున్నారు. ఇందులో ఒకరికి నెగిటివ్ రాగా గాంధీ నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. ఢిల్లీలోని మర్కజ్ కు కరీంనగర్ జిల్లా నుంచి 19 మంది
వెళ్లగా, వారిలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఇద్దరు హుజూరాబాద్ కు చెందినవారు కాగా, ఇద్దరిది కరీంనగర్. ఇంకో నలుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం సిటీలో 200 మందికి పైగా ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్నారు. కొద్దిరోజులుగా ముకరంపుర, కశ్మీర్ గడ్డప్రాంతాల్లోని ప్రజలను బయటకురానివ్వడంలేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు స్ర్ర్కీనింగ్ చేశారు. వారికి కావాల్సిన సరుకులు, కూరగాయలను ఆఫీసర్లే సరఫరా చేస్తున్నారు.

నిజామాబాద్లో ఐదు చోట్ల
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీలోని తబ్లిగి జమాత్ తో సంబంధం ఉన్నవారే. వీరు ఉంటున్న ఐదు ప్రాంతాలను ఒక కిలో మీటర్ రేడియస్ తో హాట్ స్పాట్స్ గా గుర్తించారు. మాలపల్లి, ఆటోనగర్, హబీబ్ నగర్‍, అహ్మద్ పుర కాలనీ, ఖిల్లా రోడ్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయా ఫ్యామిలీలకు చెందిన 210 మందిని ఆఫీసర్లు హోం క్వారంటైన్ లో ఉంచారు. వైద్యసిబ్బందితో ఒక దఫా స్ర్కీనింగ్ చేయగా, చాలా మంది సహకరించలేదు. ప్రజలు లాక్డౌన్ పాటించాలని ఆఫీసర్లు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆఫీసర్లు మాత్రం ఐదు ఏరియాల్లో శానిటైజేషన్ చర్యలు చేపడుతున్నారు. హోమ్ క్వారంటైన్లో ఉన్నవారికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

వరంగల్ లో 15 ప్రాంతాలు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం ఆదివారం వరకు 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో వరంగల్ అర్బన్ జిల్లా ట్రై సిటి పరిధిలోనే 24 మందికి పాజిటివ్ వచ్చింది. కాగా, వీరంతా మర్కజ్ వెళ్లి వచ్చినవారే. వీరు నివాసం ఉండే, సంచరించిన 15 ప్రాంతాలను ‘నో మూమెంట్ జోన్’గా ఆఫీసర్లు ప్రకటించారు. వీరి కుటుంబ సభ్యులు, బాధితుల కోసం ప్రత్యేకంగా సిటీలో ఐదు క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు
చేశారు. ఈ క్వారంటైన్ సెంటర్లలో 215 మందిని ఉంచారు. వీరికి పరీక్షలు పూర్తయినప్పటికీ రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ 15 హాట్ స్పాట్స్ లలో నాలుగు ఫైర్ ఇంజిన్లు, మరో రెండు వాహనాలతో కెమికల్ చేయించారు. ఆయా కాలనీలకు ఎవరు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లతో రోడ్లు మొత్తం మూసేశారు. సోమవారం కొన్ని ఏరియాల్లో అధికారులు సరుకులు పంపిణీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడి జనాలకు అవసరమైన సరుకుల జాబితాను నోట్ చేసుకున్నారు.

For More News..

ఆటోవాలా బతుకులు ఆగమాగం

ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టి వేత