మలప్పురంలో పడవ బోల్తా 22కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

మలప్పురంలో పడవ బోల్తా 22కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

కేరళలోని మలప్పురం జిల్లాలోని బీచ్ సమీపంలో మే 7న సాయంత్రం డబుల్ డెక్కర్ పడవ బోల్తా పడి మునిగిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురు చిన్నారులున్నట్టు ధృవీకరించారు. జిల్లాలోని తానూర్ ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బోటు యజమానిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పడవలో ప్రయాణీకుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా తెలియనప్పటికీ, 40 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.. బోటుకు సేఫ్టీ సర్టిఫికేట్ కూడా లేదని సమాచారం.

సమాచారం అందుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా.. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు నీటి అడుగున కెమెరాలను ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై రాజకీయ వర్గాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలుపుతూ, ఒక్కో బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన.. మలప్పురం ఘటన తనను చాలా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానన్న ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి చొప్పున PMNRF (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) నుంచి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందించబడుతుందని వెల్లడించారు.

ఈ ఘటనలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులకు సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇక మలప్పురం ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. తక్షణమే అత్యవసర సహాయక చర్యను చేపట్టాలని మలప్పురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. బాధితులకు గౌరవ సూచకంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను వాయిదా వేసి మే 8న సంతాప దినంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

https://twitter.com/PMOIndia/status/1655262858639294465