మాస్కో: రష్యాలో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ కథ విషాదాంతమైంది. దాని శకలాలను అధికారులు కనుగొన్నారు. చాపర్లో ప్రయాణిస్తున్న 22 మంది మరణించారని భావిస్తున్నారు. ఇప్పటివరకు 17 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతా ఐదుగురి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈమేరకు ఆదివారం రష్యా ఎమర్జెన్సీ మినిస్ట్రీ ఒక ప్రకటన విడుదల చేసింది. “ప్రతికూల వాతావరణ పరిస్థితులు, లో విజిబిలిటీ కారణంగా హెలికాప్టర్ కూలింది. అందులోని ప్రయాణికులు అందరూ చనిపోయారని భావిస్తున్నాం.
శకలాలను గుర్తించాం. చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో 900 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో వాటిని కనుగొన్నాం” అని మినిస్ట్రీ తెలిపింది. ఎంఐ-8 మోడల్ చెందిన ఈ హెలికాప్టర్ శనివారం కమ్చత్కా ప్రాంతంలోని వాచ్ కాజెట్స్ నుంచి బయలుదేరింది. ముగ్గురు సిబ్బంది, 19 ప్రయాణికులు ఉన్న ఈ చాపర్ గమ్యస్థానానికి మాత్రం చేరలేదు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ శకలాలను గుర్తించారు.