
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పీఎల్‌జీఏ నంబర్ వన్ ప్లటూన్ డిప్యూటీ కమాండర్ జోగా, నువాపాడ డివిజన్ కమిటీ మెంబర్ కికిడి దేవా, మాడ్ డివిజన్ దండకారణ్య ప్రెస్ టీం మెంబర్ మనోజ్, భీమా, సోమ్డీ, సంగీత, కోసి, వంజం సన్నీ, మంగ్లీ, తాతా బండిలతో పాటు పలువురు ఉన్నారు.
వీరందరిపై మొత్తం 60 లక్షల రివార్డు ఉందని ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. లొంగిపోయిన 22 మందిలో 11 మంది చత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని బడేశెట్టి గ్రామపంచాయతీకి చెందిన వారే ఉండడం గమనార్హం. ఈ పంచాయతీ నుంచి మావోయిస్ట్ పార్టీలో ఉన్నవారంతా పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కేంద్రం ప్రకటించిన రూ. కోటి ప్రోత్సాహక బహుమతి ఈ గ్రామానికి దక్కనుంది.
అబూజ్‌మఢ్‌లో ఎన్‌కౌంటర్, మావోయిస్ట్‌ల డంప్ స్వాధీనం
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మఢ్ అడవుల్లో శుక్రవారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సుమారు మూడు గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగింది. అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారంతో నారాయణ్‌పూర్ డీఆర్‌జీ బలగాలతో పాటు ఐటీబీపీ జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు. బలగాలను చూసిన మావోయిస్ట్‌లు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారు.
తర్వాత బలగాలు ఘటనాస్థలాన్ని పరిశీలించగా రూ.6 లక్షల క్యాష్‌తో పాటు 11 ల్యాప్‌టాప్‌లు, 50 కిలోల పేలుడు పదార్థాలు, 20 లీటర్ల పెట్రోలు, మూడు కుక్కర్ బాంబులు, ఎస్‌ఎల్‌ఆర్, 12 బోర్ తుపాకులకు వాడే బుల్లెట్లు, విప్లవసాహిత్యం, డాక్యుమెంట్లు దొరికినట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్, నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్‌కుమార్
వెల్లడించారు.
హిడ్మా బంకర్‌ను గుర్తించిన బలగాలు
చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా-, బీజాపూర్ బార్డర్‌లో ఉన్న మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు చెందిన బంకర్‌ను శుక్రవారం భద్రతాబలగాలు గుర్తించాయి. సుక్మా జిల్లాలోని పువ్వర్తికి చెందిన హిడ్మాను టార్గెట్‌గా చేసుకుని కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో దట్టమైన అటవీ ప్రాంతంలో సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మించిన 500 మీటర్ల పొడవైన బంకర్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి.