- ప్రతిపాదనలు పంపిన అధికారులు
- మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : మినీ అంగన్ వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసేందు కు కేంద్రం అనుమతించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27 మినీ అంగన్ వాడీలు ఉండగా 22 అంగన్ వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చేందుకు జిల్లా ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపారు.
గ్రామీణ ప్రాంతాల్లో సేవలు..
అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు విద్య, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రధాన కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లతోపాటు ఆయాలు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం మినీ సెంటర్లలో ఒక టీచర్ మాత్రమే ఉంటోంది. ప్రధాన కేంద్రాలుగా మారితే ప్రతి సెంటర్ ఒక సహాయకురాలు పెరుగడంతోపాటు టీచర్లు, ఆయాలకు వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల అంగన్వాడీ సెంటర్ల ద్వారా నిర్వహించే కార్యక్రమాలను విస్త్రృతంగా పెంచారు. ఆరోగ్యలక్ష్మి, పోషణ్ అభియాన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తదితర కార్యక్రమాలు పెరిగడంతో మినీ అంగన్వాడీ టీచర్లపై భారం పెరిగింది.
గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా..
గిరిజన ప్రాంతాల్లో 300 జనాభా, గ్రామాల్లో 400 జనాభా ఉన్న మినీ సెంటర్లను.. మెయిన్ సెంటర్లుగా మార్చుతారు. ప్రస్తుతం ప్రధాన అంగన్వాడీ కేంద్రాల ద్వారా 6 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలకు నెలకు 25 కిలలో బాలామృతం ప్యాకెట్స్, 16 కోడి గుడ్లను టేక్ హోం రేషన్ గా అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు ఒకపూట సంపూర్ణ భోజనం, రోజూ గుడ్డ, పాలు, పప్పు, కూరగాయలతో భోజనం పెడుతున్నారు. దీంతోపాటు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు.దీంతోపాటు పిల్లలకు ఆట, పాటలు నేర్పిస్తారు. పోషణ్ అభియాన్, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలను ఈ సెంటర్ల ద్వారా నిర్వహిస్తారు.
అద్దె భవనాలలో..
ప్రభుత్వం పక్కా భవనాలు మంజూరు చేయకపోవడంతో జిల్లాలో అంగన్వాడీల నిర్వహణ అద్దె భవనాల్లో కొనసాగుతోంది. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 587 అంగన్వాడీ సెంటర్లు ఉండగా 257 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలున్నాయి. 181 కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 159 కేంద్రాలను అద్దె భవనాల్లో నడుపుతున్నారు. సిరిసిల్ల ప్రాజెక్ట్ పరిధిలో 362 అంగన్వాడీ సెంటర్లలో 107 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వేములవాడ ప్రాజెక్ట్ పరిధిలో 225 కేంద్రాలు ఉండగా.. 52 అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. జిల్లాలో 80 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఆయాలు 64, అంగన్వాడీ టీచర్లు 15, మినీ టీచర్పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. గతేడాది ఆగస్టులో 72 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. 600 పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి భర్తీని వాయిదా వేయడంతో పోస్ట్ ల రిక్రూట్ మెంట్ ఆగిపోయింది. మినీ సెంటర్లను మెయిన్సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసే క్రమంలో పోస్ట్ ల రిక్రూట్ మెంట్ ఉంటుంది. అయితే వాటి కోసం పాత దరఖాస్తులను పరిశీలిస్తారా లేక కొత్త దరఖాస్తులను స్వీకరిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రతిపాదనలు పంపాం
జిల్లాలో 22 మినీ అంగన్వాడీ సెంటర్ లను అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. జిల్లాలో 27 మినీ కేంద్రాలుండగా అందులో 22 సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తే పోస్ట్ లు కూడా పెరునున్నాయి. రెండు నెలలో అంగన్వాడీటీచర్లు, ఆయాల నోటిఫికేషన్ పై క్లారిటీ వస్తుంది.
– లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి
పోస్ట్ లను రిక్రూట్ చేయాలి
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టును రిక్రూట్ చేయాలి. మినీ కేంద్రాల్లో ఒకే టీచర్ ఉండటంతో పని ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువ సేవలందించే ప్రతి సెంటర్ కు ఆయాను నియమించాలి. అద్దె భవనాల్లో నడుస్తున్న సెంటర్ లకు ప్రభుత్వం సొంత భవనాన్ని మంజూరు చేయాలి.
– కల్లూరి చందన, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు