హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్లు ఒకే కాంట్రాక్టర్‌కు 22 పనులివ్వడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రెండు ప్రభుత్వ శాఖలు ఒకే కాంట్రాక్టర్‌కు అన్ని పనులు ఎలా ఇచ్చాయని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించరాదని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన బెంచ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాంట్రాక్టర్ ఎంఎస్‌ఆర్ కనస్ట్రక్షన్స్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. కాంట్రాక్టులు ఇవ్వడంలో రూ.కోట్ల అవినీతి జరుగుతోందని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మలపల్లి రాంబాబు ఈ పిల్ వేశారు. వాదనల తర్వాత తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది.