వరంగల్లో కరోనాతో ఒకరి మృతి

వరంగల్ జిల్లాలో కరోనా మరణం కలకలం సృష్టించింది. ఖానాపురం మండలం యాపచెట్టు పంచాయతీ పరిధిలోని కోమటిపల్లి తండాకు చెందిన ఓ యువకుడు కొవిడ్ కారణంగా చనిపోయాడు. ఇస్లావత్ మురళి (22) కి నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వరంగల్లోని ఏకశిల హాస్పిటల్ కు తరలించారు. అక్కడ కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ గా తేలడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స పొందుతూ మురళి కన్నుమూశాడు. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 

కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మురళి మృతితో వరంగల్ జిల్లా జనం మళ్లీ కరోనా భయంతో వణికిపోతున్నారు.