రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి తేజస్విని కాలనీలో నందిని (22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఏప్రిల్ 8వ తేదీ శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే..గత రెండు సంవత్సరాల క్రితం కర్ణాటకు చెందిన సందీప్ అనే వ్యక్తితో నందినికి వివాహం జరిగింది. సంవత్సరం క్రితం హైదరాబాద్ కు వచ్చి జీవనం సాగిస్తున్నారు సందీప్ దంపతులు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని తనువు చాలించింది నందిని.
నందిని స్వస్థలం కర్ణాటకలోని బీదర్. సమాచారం అందుకున్న నందిని తల్లిదండ్రులు అక్కడినుండి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. తమ బిడ్డను భర్త, అత్తమామలు చిత్ర హింసలు పెట్టి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ నందిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నందిని ఒంటిపై గాయాలు ఉన్నాయని.. అతి దారుణంగా తమ బిడ్డను కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు చేస్తున్నారని తెలిపారు. నీ బిడ్డ చనిపోయింది.. వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండంటూ నందిని భర్త సందీప్ ఫోన్ చేశాడని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.
మృతురాలి కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త సందీప్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. ఇక అత్త విజయ, మామ లక్ష్మన్ రావులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమ బిడ్డను చంపడమే కాకుండా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని.. కేసు వెనక్కి తీసుకోకపోతే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారంటూ నందినీ పేరెంట్స్ పోలీసులకు వివరించారు.