
పంజాబ్‌లో ఓ యువతిపై తన స్నేహితుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన హాస్టల్ వద్ద దింపుతానని చెప్పి కారులో ఎక్కించుకుని, దారిలో ఆపి తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. పంజాబ్‌లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.
ఆక్టోబర్ 29న బాధిత యువతి (22) బర్నాలాలోని తన ఇంటి నుంచి మొహాలీకి బస్సులో చేరుకుంది. రాత్రి కావడం, తన వద్ద లగేజీ ఎక్కువగా ఉండడంతో బస్టాండ్‌కు వచ్చి తనను పికప్ చేసుకోవాలని స్నేహితుడు కుష్విందర్ సింగ్‌కు ఫోన్ చేసింది. రాత్రి 8 గంటల సమయంలో అక్కడి చేరుకుని ఆమెను తన కారులో పికప్ చేసుకున్న కుష్విందర్.. ఆమె ఉంటున్న జీరక్‌పూర్ హాస్టల్లో దించకుండా నిర్మానుష్యంగా ఉన్న ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తుపాకీతో బెదిరించి.. ఆమెను రేప్ చేసి, ఆ రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె ఒక క్యాబ్‌లో హాస్టల్‌కు చేరుకుంది. తర్వాతి రోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. కుష్విందర్పై ఫిర్యాదు చేసింది. అయితే బఠిండాకు చెందిన కుష్విందర్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.