- 3 రోజులు.. 220 మరణాలు?
- గాంధీలో పెరుగుతున్న కరోనా డెత్స్
పద్మారావునగర్, వెలుగు: కరోనా నోడల్ కేంద్రం గాంధీ ఆసుపత్రిలో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. కరోనా పంజాకు అమాయకులు వందల సంఖ్యలో బలి అవుతున్నారు. అధికారికంగా గాంధీలో డెత్స్ లెక్కలు బయటకు రాకపోయినప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆదివారం (63), సోమవారం (72), మంగళవారం ( 85).. ఇలా మూడు రోజుల్లో కలిపి మొత్తం 220 మంది కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. అయితే దీన్ని వైద్యులు ధ్రువీకరించడం లేదు. కేవలం కరోనాతోనే చనిపోవడం లేదని, వారికి కార్డియాక్, కిడ్నీ, లివర్, లంగ్స్ కు సంబంధించిన తీవ్ర అనారోగ్యం కూడా లైఫ్ రిస్క్ కు కారణమవుతోందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ‘వెలుగు’తో చెప్పారు. మంగళవారం సాయంత్రం వరకు గాంధీలో మొత్తం 681 మంది కొవిడ్ సీరియస్పేషెంట్లు ఐసీయూ వార్డుల్లో ట్రీట్ మెంట్పొందుతున్నట్లు గాంధీ నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కొందరు పేషేంట్లు వెంటిలేటర్ పై, మరికొందరు పీప్యాప్ పై ఉన్నారని చెప్పారు. పాజిటివ్ పేషెంట్ల డెడ్‌బాడీల కోసం వారి బంధువులు పదుల సంఖ్యలో మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. శవాల అప్పగింతకు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
కరోనా మార్చురీగా పోస్టుమార్టం బిల్డింగ్..
గాంధీ ఆసుపత్రిని కొవిడ్ ట్రీట్మెంట్కే పరిమితం చేయడంతో జనరల్ మార్చురీ బిల్డింగ్ ను కూడా అధికారులు కరోనా మార్చురీగా మార్చారు. గాంధీలో నాన్‌కొవిడ్ డెడ్‌బాడీల పోస్టుమార్టంలను నిలిపేశారు. పోస్టుమార్టం కోసం సాధారణ డెడ్‌బాడీలను ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. జనరల్ మార్చురీలో 150 డెడ్‌బాడీస్ కెపాసిటీ ఉంది.