- మూడేండ్లుగా పెండింగ్లోనే రూ.25 కోట్ల ప్రపోజల్స్
- ఆరుతడి పంటలే దిక్కవుతున్నాయని రైతుల ఆవేదన
చండ్రుగొండ,వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని వెంగళరావు ప్రాజెక్టు అలుగుకు గండి పడి మూడేండ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందటి వరకు వెంగళరావు ప్రాజెక్టు కింద వరి సాగు చేసిన రైతులు అలుగుకు గండి పడడంతో ఆరుతడి పంటలకే పరిమితం అవుతున్నారు. అలుగు నిర్మాణానికి రూ.25 కోట్లతో పంపించిన ప్రపోజల్స్ పెండింగ్లో ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది.
మిషన్ కాకతీయ కింద పనులు చేసినా..
వెంగళరావు సాగర్ ప్రాజెక్టు కింద 2200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు కింద చండ్రుగొండ, దామరచర్ల, సీతాయిగూడెం, ఇమ్మడి రాముడి బంజరు, తిప్పనపల్లి, మహ్మద్ నగర్, అయ్యన్నపాలెం గ్రామ రైతుల భూములున్నాయి. మూడేండ్ల క్రితం మిషన్ కాకతీయ స్కీమ్ కింద రూ.5.40 కోట్ల అంచనాతో కట్ట, తూములు, కాల్వల రిపేర్ పనులు చేశారు. ఆ సమయంలో అలుగు తరుచూ కోతకు గురవుతుండడంతో డిజైన్ మార్చి రూ. 25 కోట్ల ఫండ్స్ మంజూరుకు ప్రపోజల్ పంపారు. నేటికీ నిధులు మంజూరు కాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో గత ఏడాది అలుగు భారీగా కోతకు గురైంది. కలెక్టర్ అనుదీప్ ప్రాజెక్టును సందర్శించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది వరద మళ్లింపునకు రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇసుక బస్తాలు అడ్డుగా వేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ మట్టితో నింపిన బస్తాలు వేశాడని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఫండ్స్ మంజూరు చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
నిధుల మంజూరు చేస్తలేరు..
వెంగళరావు ప్రాజెక్ట్ అలుగు డిజైన్ మార్చి కోతకు గురి కాకుండా అధికారులు పంపిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రతీ ఏడాది వరద మళ్లింపునకు లక్షలు ఖర్చు చేస్తున్నా నీరందడం లేదు. ఫండ్స్ మంజూరు చేసి పనులు ప్రారంభించాలి. - చారుగుండ్ల రాంబాబు..
రైతు, దామరచర్ల ఫండ్స్ రాగానే పనులు ప్రారంభిస్తాం..
వెంగళరావు ప్రాజెక్ట్ అలుగు నిర్మాణానికి రూ.25 కోట్లతో ప్రపోజల్స్ పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. - కృష్ణ, ఇరిగేషన్ డీఈ