- జ్యోతిర్మఠ్ స్వామి శంకరాచార్య ఆరోపణలు
- దర్యాప్తు జరిపించాలని డిమాండ్
- ఢిల్లీలో కేదార్ నాథ్ ఆలయ నిర్మాణం కరెక్టు కాదని వ్యాఖ్య
న్యూఢిల్లీ : కేదార్ నాథ్ ఆలయం నుంచి 228 కిలోల బంగారం మాయమైందని జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి ఆరోపించారు. ఇంత జరిగినా ఈ వ్యవహారంపై ఇంకా దర్యాప్తు ప్రారంభించలేదని, వెంటనే ఎంక్వైరీ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. స్కామ్ వెనుక ఎవరు ఉన్నారో తేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఒకవైపు ఆలయం నుంచి బంగారం మాయమైతే ఆ వ్యవహారంపై దర్యాప్తు జరపకుండా ఢిల్లీలో కేదార్ నాథ్ తరహా ఆలయం కట్టడం కరెక్టు కాదని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో ఆ ఆలయ నమూనా కడితే కేదార్ నాథ్ పవిత్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దేశంలోని వేర్వేరు చోట్ల 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయని శివ పురాణంలో రాసి ఉంది. అందులో కేదార్ నాథ్ ఒకటి. హిమాలయాల్లో ఆ గుడి వెలిసింది. అంతటి పవిత్రత ఉన్న ఆలయానికి ఢిల్లీలో నమూనా ఆలయం కట్టడం ఏంది? అలాగే మతపరమైన వ్యవహారాల్లో రాజకీయ జోక్యం రోజురోజుకు పెరుగుతోంది” అని అవిముక్తేశ్వరానంద అన్నారు. కాగా.. వాయువ్య ఢిల్లీలోని బురానీ ప్రాంతంలో కేదార్ నాథ్ ఆలయ నమూనాకు ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.