ప్రశాంత్ లీలలు : 23 బంగారం బ్యాగులు కొట్టేసి రోల్డ్​గోల్డ్​ బ్యాగులు పెట్టిండు!

  •     రాజుపేట కెనరా బ్యాంకులో బయటపడుతున్న అప్రైజర్​ ప్రశాంత్​ లీలలు
  •     కొట్టేసిన బంగారం విలువ రూ. కోటి 38 లక్షలు  
  •     బ్యాంకు ఎదుట కస్టమర్ల ఆందోళన 
  •     అందరికీ సెటిల్ ​చేస్తామన్న బ్యాంకు ఆఫీసర్లు

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంక్ లో అప్రైజర్​ప్రశాంత్​ బంగారం కొట్టేసిన ఘటనలో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఘటనపై ఆందోళన చెందిన కస్టమర్లు సోమవారం బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో వరంగల్ రీజనల్​ డిప్యూటీ జీఎం శ్రీనివాసరావు, అసిస్టెంట్ జీఎం మాధవి, లీగల్ అడ్వైజర్​తో కలిసి రాజుపేట కెనరా బ్యాంక్  మేనేజర్ కిరణ్ కుమార్​తో మాట్లాడారు. ఈ సందర్భంగా కస్టమర్లతో డిప్యూటీ జీఎం మాట్లాడుతూ బ్యాంక్ అప్రైజర్​ ప్రశాంత్​పై శనివారమే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

కస్టమర్లు బ్యాంక్​లో తాకట్టు పెట్టిన 23 బంగారం బ్యాగులు మిస్ అయ్యాయని, వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ నగల బ్యాగులున్నట్టు తేలిందన్నారు. మాయం చేసిన బంగారం సుమారు 2 కిలోల 117 గ్రాములు కాగా, దీని విలువ సుమారు కోటి 38 లక్షల వరకు ఉంటుందన్నారు. బంగారం పోయిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కస్టమర్లకు బంగారం లేదా మార్కెట్ వాల్యూ లెక్కించి ఎప్పుడు కావాలన్నా సెటిల్ చేస్తామన్నారు. బ్యాంకు వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగపేట ఎస్సై రవికుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.