ముగిసిన తొలి ఘట్టం.. ఆదిలాబాద్​​ సెగ్మెంట్​కు 23 మంది నామినేషన్లు

  • పెద్దపల్లిలో 109 సెట్ల దాఖలు
  • నేడు నామినేషన్ల స్క్రూట్నీ 

ఆదిలాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి ఘట్టం ముగిసింది. ఈ నెల 18 నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా స్వీకరించారు. కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు మొదటిసారి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి గోడెం నగేశ్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నగేశ్ ఈసారి బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 

గురువారం ఆత్రం సుగుణ తన చివరి సెట్ నామినేషన్ ను నిర్మల్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు, నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డితో కలిసి సమర్పించారు. ఆమెతో పాటు చివరి రోజు17 మంది అభ్యర్థులు 18 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తంగా 23 మంది అభ్యర్థులు 42 సెట్ల నామినేషన్లు వేశారు. ఇందులో 9 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉండగా, బీజేపీ లీడర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, బీఆర్ఎస్ నేత ధరావత్ నరేందర్ సైతం నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఇప్పటికే పలు పార్టీలు తమ బలాన్ని ప్రదర్శించాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించింది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ప్రచార జోష్​ను పెంచనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అసలైన రాజకీయ ఎన్నికల సందడి నెలకొంది. మే 11 వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉండటంతో ఆయా పార్టీల నేతలు ఉరుకులు పరుగులు పెట్టనున్నారు. 

పెద్దపల్లి స్థానానికి 63 మంది

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి స్థానానికి 63 మంది అభ్యర్థులు 109 సెట్ల నామినేషన్లు సమర్పించారు. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ తరఫున కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. వంశీకృష్ణ తరఫున మంచిర్యాల జిల్లాకు చెందిన లీడర్లు గురువారం మరో రెండు సెట్​నామినేషన్లు సమర్పించారు. వచ్చిన నామినేషన్లకు శుక్రవారం స్క్రూట్నీ నిర్వహించనున్నారు.