ఎలక్షన్ రిజల్ట్స్ పై బెట్టింగులు..పందాల్లో 23 వేల కోట్లు?

లోక్​సభ ఎలక్షన్లు మరో ఎనిమిది రోజుల్లో పూర్తవుతాయి.​ మొత్తం ఏడు దశల పోలింగ్​ చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌‌‌‌ 11 న జరిగిన మొదటి విడత పోలింగ్‌‌‌‌ నుంచి ఈ నెల 23న వెలువడే ఫలితాలకు నడుమ దాదాపు 40 రోజుల వ్యవధి రావడంతో దేశమంతా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫలానా కూటమిదే విక్టరీ అంటూ బెట్టింగ్​లు కడుతున్నారు. ఈ బెట్టింగ్‌‌‌‌ విలువ రూ.23 వేల కోట్ల వరకు చేరింది.

దేశంలోని మొత్తం 543 లోక్​సభ సెగ్మెంట్లలో మరో 118 స్థానాల్లో మాత్రమే ఓటింగ్​ జరగాల్సి ఉంది.  అభ్యర్థుల జాతకాలు ఈ నెల 23న వెల్లడి కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఎవరన్నదీ మరో 13 రోజుల్లో తెలిసిపోతుంది. ఫలితాలపై ప్రజల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.

ఈ ఇంట్రస్ట్​ కాస్తా వేల కోట్ల రూపాయల్లో పందాలు కాసే లెవెల్​కి చేరింది. జనరల్​ ఎలక్షన్​ సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వివిధ అంశాలపై లీడర్ల ప్రచారం ఆకాశమే హద్దుగా జరిగింది. ఇప్పుడు వాళ్ల పార్టీలు, కూటములు తరఫున బెట్టింగ్​లు కూడా అదే రేంజ్​లో సాగుతున్నాయి. అయితే ఈ పందెం రాయుళ్లు ఏ అలయెన్స్​కి స్పష్టమైన మెజారిటీ వస్తుందో క్లియర్​గా చెప్పలేకపోతున్నారు. ప్రతిపక్ష కూటముల (యూపీఏ, మహాకూటమిల) మధ్య కూడా పోటీ తీవ్రంగా నెలకొందని అంటున్నారు.

మళ్లీ తప్పని పొత్తులు! 

ఎన్​డీఏ, యూపీఏ మాదిరిగా మహా కూటమికి కూడా పెద్ద సంఖ్యలో సీట్లు వస్తాయని, దీనివల్ల ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ అలయెన్స్​ల మధ్య ఎంపీల బేరసారాలు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా ఎన్నికల కోసం పొత్తులు పెట్టుకొన్న పార్టీలు ఇకపై కొయిలేషన్​​ దిశగా చర్చలకు దిగుతాయని చెబుతున్నారు. లోక్​సభలో హంగ్​ ఏర్పడే చాన్స్​లూ లేకపోలేదని సూచిస్తున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్​డీఏ మళ్లీ అధికారం చేపట్టేలా ‘మేనేజ్​’ చేయగలదని బెట్టింగ్​ మార్కెట్​ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.

ఈ కూటమి 185 నుంచి 220 వరకు సీట్లు గెలవనుండగా, యూపీఏ 160 నుంచి 180 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని స్పెక్యులేటర్లు చెప్పారు. ఇదిలా ఉంటే, పందాల్లో భాగంగా ఎన్​డీఏ రేటు ఒకటికి రెండు రూపాయలు పలుకుతుండగా యూపీఏ రేటు రూపాయిన్నర వద్దే ఆగిపోయిందని అంటున్నారు. మరో వైపు దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సర్జికల్​ స్ట్రయిక్స్‌‌‌‌ ఈ ఎన్నికల్లో కమలనాథులకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవచ్చనే డౌట్‌‌‌‌ వ్యక్తమవుతోంది.

గ్రాండ్​ అలయెన్స్​ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించి కింగ్​ మేకర్​లా ఎదగనుందని సూరత్​, ముంబై, కోల్​కతా, ఢిల్లీల్లోని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలను సైతం మహా కూటమి వెనక్కి నెట్టగలదని తేల్చిచెబుతున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్​ అమిత్​ షాలకు వాళ్ల సొంత రాష్ట్రం గుజరాత్​లో ఎదురు దెబ్బ తగలనుందని అంచనా వేస్తున్నారు. ‘అభివృద్ధి విషయంలో దేశానికి మోడల్​’ అంటూ తెగ ప్రచారం చేసిన ఆ స్టేటు నుంచి కమలదళం బ్యాడ్ న్యూస్​ వినాల్సి వస్తుందని టాక్​.

గుజరాత్​లో పోయినసారి మొత్తం 26 లోక్‌‌‌‌సభ సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈసారి ఆరు వరకు కోల్పోవాల్సి వస్తుందని బుక్కీలు లెక్కలేస్తున్నారు. సూరత్​, ముంబై, ఢిల్లీల్లోని బెట్టింగ్​ మార్కెట్లు మాత్రం దీన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు. అధికార పార్టీ గుజరాత్‌‌‌‌లో 22 స్థానాల్లో విజయం సాధిస్తుందని, గ్రాండ్​ ఓల్డ్ కాంగ్రెస్‌‌‌‌​ పార్టీ కేవలం నాలుగు చోట్లే నెగ్గగలదని అంటున్నాయి. ఆ రాష్ట్రంలో కమలనాథులు పోటీకి నిలబెట్టిన క్యాండిడేట్లలో 19 మంది విన్నర్లుగా నిలుస్తారని, హస్తం పార్టీ వాళ్లు ఏడుగురు విజేతలవుతారని సూరత్​, ముంబైల్లోని సట్టా బజార్​ వర్గాలు బలంగా చెబుతున్నాయి.

బీజేపీ సౌరాష్ట్ర రీజియన్​లో రెండు నుంచి మూడు; నార్త్​, సౌత్​ గుజరాత్​ల్లో ఒకటి చొప్పున ఎంపీ సీట్లు కోల్పోతుందని బెట్టింగ్​ బంగార్రాజులు లెక్కలేస్తున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలో కాంగ్రెస్​ అమ్రేలీ, సురేంద్ర నగర్​, జునాగఢ్ స్థానాలను ఖాతాలో వేసుకోనుంది. నార్త్​లో బనస్కాంత, పటాన్​ సెగ్మెంట్లను; సౌత్​లో వలసాడ్​ నియోజకవర్గాన్ని హస్తం పార్టీ కైవసం చేసుకోనుందని స్పెక్యులేటర్ల డేటా చెబుతోంది. ఎన్నికల్లో గెలిచేవాళ్లను బట్టే ఈ బెట్టింగుల్లో విజేతలు డిసైడ్​ అవుతారు. అప్పటివరకు పబ్లిక్​కి, పంటర్లకు ఈ సస్పెన్స్​ తప్పదు.