వరంగల్‍ జిల్లాలో దరఖాస్తుల జాతర

వరంగల్‍ జిల్లాలో దరఖాస్తుల జాతర
  • వరంగల్​ ఐదు జిల్లాల్లో వచ్చిన అప్లికేషన్లు 2,32,101
  • 4 సంక్షేమ పథకాలకు ఊరూరా దరఖాస్తుల వెల్లువ
  • అత్యధికంగా కొత్త రేషన్‍ కార్డుల కోసం 1,11,524 వినతులు
  • ఇందిరమ్మ ఇండ్లకు 84,467.. 
  • మహబూబాబాద్‍ జిల్లా మినహా.. 05 జిల్లాల వివరాలివే

వరంగల్‍/జనగామ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21 నుంచి అందించే నాలుగు సంక్షేమ పథకాల కోసం ఓరుగల్లులో అప్లికేషన్ల జాతర నడిచింది. మహబూబాబాద్‍ జిల్లా మినహాయిస్తే, మిగతా ఐదు జిల్లాల్లో కొత్త రేషన్‍ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కోసం రికార్డు స్థాయిలో 2,32,101 అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు ఉమ్మడి జిల్లా అంతటా గ్రామాలు, మున్సిపాలిటీలు, గ్రేటర్‍ సిటీ పరిధిలో ఎక్కడికక్కడ గ్రామ, పట్టణ సభలు నిర్వహించారు. పథకాలకు సంబంధించి అధికారులు గతంలోనే సర్వే చేపట్టిన నేపథ్యంలో మొదటి దఫా జాబితాలో పథకాలు పొందినవారి వివరాలను గ్రామ సభల్లో వెల్లడించారు. పథకాలకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు.  

సగం దరఖాస్తులు కొత్త రేషన్‍ కార్డులకే..

రాష్ట్ర ప్రభుత్వం అందించే నాలుగు పథకాలైన కొత్త రేషన్‍ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలలో అత్యధికంగా కొత్త రేషన్‍ కార్డుల కోసమే ప్రజలు ఎక్కువ దరఖాస్తులు పెట్టుకున్నారు. 5 జిల్లాల్లో అన్ని అప్లికేషన్లు కలిపి 2,32,101 రాగా, ఇందులో ఒక్క రేషన్‍ కార్డుల కోసమే 1,11,524 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆపై ఇందిరమ్మ ఇండ్ల కోసం 84,467 మంది గ్రామ సభల్లో అప్లికేషన్లు అందించారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 33,165 మంది, రైతు భరోసా కోసం 2,945 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. 

ALSO READ | అప్లికేషన్లు ఫుల్..ఎక్కువ రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకే ​

గ్రేటర్‍ జిల్లాల్లో ఎక్కువ, జనగామలో తక్కువ

ఓరుగల్లులో మహబూబాబాద్‍ జిల్లా సమాచారం అందని నేపథ్యంలో.. మిగతా ఐదు జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తే, గ్రేటర్‍ జిల్లాలైన హనుమకొండ, వరంగల్​లో ఎక్కువ మంది వివిధ పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. హనుమకొండ 57,477, వరంగల్‍ 57,008 మంది అప్లికేషన్లు ఇవ్వగా, ఆపై ములుగు 42,657, భూపాలపల్లి 40,711 మంది, తక్కువగా జనగామ జిల్లా నుంచి 34,248 మంది దరఖాస్తు చేశారు.

జిల్లాల వారీగా నాలుగు పథకాలకు సంబంధించిన వివరాలు

జిల్లా              రేషన్‍ కార్డులు    ఇందిరమ్మ ఇండ్లు    ఆత్మీయ భరోసా    రైతు భరోసా    మొత్తం 
 

వరంగల్‍         28,868                   20,578                       6,982                            580             57,008

హనుమకొండ  32,987                 19585                          4,517                            388              57,477

జనగామ          14,532                  13955                         5,270                             491              34,248

భూపాలపల్లి    20,186                  12661                        7,344                               520             40,711

ములుగు         14,951                  17688                         9,052                              966               42,657

మొత్తం             1,11,524              84,467                       33,165                             2945            2,32,101