వడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం .. దొడ్డు, సన్నరకాలకు వేర్వేరు సెంటర్లు

వడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం .. దొడ్డు, సన్నరకాలకు వేర్వేరు సెంటర్లు
  • ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
  • జనగామ జిల్లాలో 2.35 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
  • 300 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు 

జనగామ, వెలుగు : యాసంగి వడ్ల కొనుగోళ్లకు యంత్రాంగం సమాయత్తం అవుతోంది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జనగామ జిల్లాలో 2.35 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకోగా, ఇందుకోసం 300 సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 

కొనుగోళ్లు సపరేట్..​

ధాన్యం సేకరణ సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా కొనుగోళ్లు చేపట్టనున్నారు. సెంటర్లను కూడా వీలైనంత మేరకు దూరం దూరంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. ఇందుకోసం ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచారు. గతేడాది 190 ఏర్పాటు చేస్తే, ఈ సారి 300 సెంటర్లను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. కాగా, సన్నరకం వడ్లకు సర్కారు క్వింటాలుకు రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో వీరిని ప్రోత్సహించాలనే సర్కారు లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఈసారి 119 సెంటర్లు కేవలం సన్న వడ్ల కొనుగోలుకే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దొడ్డు రకం వడ్లను మరో 181 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేయనున్నారు.

 134 సెంటర్లు పీఏసీఎస్​, 164 ఐకేపీ, రెండు డీసీఎంఎస్​ల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 3,75,453 మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇందులో 2,35,954 మెట్రిక్​ టన్నులు సర్కారు సెంటర్లకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. వీటిలో సన్నరకం 62,013 మెట్రిక్​ టన్నులైతే, దొడ్డురకం 1.73,941 మెట్రిక్​ టన్నులుగా అంచనా వేస్తున్నారు. కొనుగోళ్లకు ప్రస్తుతానికి పది లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా, అవసరం మేరకు తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

మొదటి వారంలో..

వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలువుతుండగా, వచ్చేనెల మొదటి వారంలో సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఇందుకోసం జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ఇటీవల అధికారులతో రివ్యూ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏ గ్రేడ్​ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోళ్లు జరిపిన వెంటనే ట్యాబ్​లో వివరాల ఎంట్రీ, త్వరగా డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. యాసంగిలో చెడగొట్టు వానలు పడే చాన్స్​ ఉండడంతో అధికారులు అవసరమైనన్నీ టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని ప్లాన్​ చేస్తున్నారు. కొనుగోళ్లు జరిపిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో 1.27 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి ఏకంగా 2.35 లక్షల మెట్రిక్​ టన్నులను టార్గెట్​ పెట్టుకున్నారు.   

ఏర్పాట్లు చేస్తున్నాం.. 

కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు స్పీడప్​ చేశాం. వచ్చే నెల మొదటి వారం లో సెంటర్లు ప్రారంభంకానున్నాయి. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నం.

వీ హథీరామ్, డీఎం, సివిల్​ సప్లై, జనగామ