అమెరికా చరిత్రలో అత్యంత చీకటి రోజు సెప్టెంబర్ 11, 2001. ఆ రోజు ఉదయం 8:46కు అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ప్రారంభమవుతున్న ఉషోదయ వేళ.. హఠాత్తుగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 767 విమానం 20,000 గ్యాలన్ల జెట్ ఇంధనంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ).. 110- అంతస్తుల నార్త్ టవర్‌లోని 80వ అంతస్తులోకి దూసుకెళ్లింది. ఎవరూ ఊహించని ఈ దుర్ఘటనలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టవర్‌లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే దాదాపు 9:03 నిమిషాల సమయంలో రెండవ బోయింగ్ - 767 యునైటెడ్ ఏయిర్‌లైన్స్ విమానం-175 డబ్ల్యూటీసీ సౌత్టవర్ 60వ అంతస్తులోకి దూసుకుపోయింది.
అమెరికాలోని ప్రఖ్యాత ప్రపంచ వాణిజ్య కేంద్రపు జంట ఆకాశహర్మ్యాలపై టెర్రర్ ఎటాక్ జరిగి నేటికి 23ఏండ్లు పూర్తయ్యాయి. కాగా, అదేరోజు 9:37 గంటలకు డౌన్‌టౌన్ వాషింగ్టన్ ప్రాంతంలోని యూఎస్ మిలిటరీ కేంద్ర కార్యాలయం పెంటగాన్ తూర్పు దిక్కున 3వ అమెరికన్ బోయింగ్ ఏయిర్‌లైన్స్ విమానం-77 దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో 125 మంది మిలిటరీ సిబ్బంది, పౌరులతో పాటు విమానంలోని 64 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాకు వెళ్లాల్సిన యునైటెడ్ ఫ్లైట్ - 93 విమానం హైజాక్ అయిన 40 నిమిషాలకు హైజాకర్లు కాక్‌పిట్‌కు నిప్పంటించడంతో పెన్సిల్వేనియా సమీప శాన్కుస్‌విల్లే క్షేత్రంలో 10:03 గంటలకు కుప్పకూలి పోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 44 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
అల్‌ఖైదా టెర్రరిస్టుల అమానుష చర్య
అల్‌ఖైదా ఇస్లామిక్ తీవ్రవాద హైజాకర్లు నాలుగు జట్లుగా విడిపోయి సృష్టించిన నాలుగు విమానాల విధ్వంసం, జంట టవర్లు కూలిపోవడంతో.. విమాన ప్రయాణికులతో కలిపి 78 దేశాలకు చెందిన 2,996 మంది పౌరులతో పాటు 19 మంది (3 జట్లలో ఐదుగురు సభ్యులు, ఒక జట్టులో నలుగురు సభ్యులు) సౌదీ అరేబియా, అరబ్ దేశాలకు చెందిన ఆత్మాహుతిదళ తీవ్రవాదులు మరణించగా, దాదాపు 25,000 మంది గాయాలతో బయటపడ్డారు. 1979లో అఫ్గనిస్థాన్‌ను రష్యా ఆక్రమించుకోవడంతో మెుదలైన తీవ్రవాద సెగలు నేటికీ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూనే ఉన్నాయి.
అమెరికాను శత్రుదేశంగా భావించిన అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ ఈ నాలుగు విమాన దుర్ఘటనలకు పకడ్బందీగా ప్రణాళికలు వేసి అమలుపరిచింది. డబ్ల్యూటీఓ ట్విన్ టవర్లు కూలిపోవడంతో 2,763 మంది ప్రాణాలు అర్పించారు. ప్రతీకార చర్యగా అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్‌ను వెంటాడి 2011లో హతమార్చడం చూశాం. ఈ 9/11 దుర్ఘటన నేపథ్యంలో యూఎస్ నియమించిన ‘9/11 కమిషన్’ తన నివేదికను 22 జులై 2004న సమర్పించింది. ఈ దాడులకు ప్రధాన కారకుడు ‘ఖలీద్ షేక్‌మహమ్మద్’ అని తేల్చింది. అమెరికన్ ప్రభుత్వం 9/11 రోజున ‘దేశభక్తుల దినం (పాట్రియాట్ డే)’ పాటించడం ఆనవాయితీగా మారింది. ఏది ఏమైనా సెప్టెంబర్11 దుర్ఘటన అమెరికా చరిత్రలో అత్యంత చీకటి రోజుగా నిలుస్తున్నది.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి