యాదాద్రి జిల్లాలో 24 కోట్ల డ్రగ్స్ పట్టివేత

యాదాద్రి జిల్లాలో 24 కోట్ల డ్రగ్స్ పట్టివేత

 

  • 120 కిలోల సింథటిక్ ​డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్న యాదాద్రి పోలీసులు 
  • ఏడుగురి అరెస్ట్.. పరారీలో మరో ఐదుగురు

యాదాద్రి, వెలుగు: భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను యాదాద్రి పోలీసులు పట్టుకున్నారు. రూ.24 కోట్ల విలువైన 120 కిలోల ఎఫెడ్రిన్, మెఫెడ్రోన్ సింథటిక్​ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్ట్​ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. యాదాద్రి జిల్లా చిన్నకందుకూరుకు చెందిన నేతి కృష్ణారెడ్డి బోడుప్పల్​లో ఉంటూ రియల్​ఎస్టేట్​వ్యాపారంతో పాటు  చిన్న కాంట్రాక్టులు చేస్తుంటాడు. అతనికి జీడిమెట్లకు చెందిన ఇస్మాయిల్​తో పరిచయమైంది.

తనకు నిషేధిత మత్తుపదార్థాలైన ఎఫెడ్రిస్​, మెఫెడ్రోన్​కావాలని ఇస్మాయిల్​కోరాడు. దీని కోసం యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలోని శ్రీయాదాద్రి ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన వాసుదేవాచారి, భాను ప్రసాద్​తో కృష్ణారెడ్డి మాట్లాడాడు. ఇస్మాయిల్ కోరిన మత్తు పదార్థాలు కావాలని, మంచి కమీషన్​వస్తుందని చెప్పడంతో వాళ్లు అంగీకరించారు. దీనికి ఓ కెమికల్​ కంపెనీలో పదేండ్లుగా పని చేస్తున్న సత్యనారాయణను సంప్రదించడంతో అతడు కూడా మత్తు పదార్థాల తయారీకి ఒప్పుకున్నాడు. అనంతరం అవసరమైన వస్తువులు తెప్పించుకొని  శ్రీయాదాద్రి ఫార్మాస్యూటికల్​కంపెనీలో తయారీ ప్రారంభించారు.

వీరు తయారు చేసిన డ్రగ్స్ ముంబైకి చెందిన సల్మాన్​ షేక్​డోలా వద్ద పని చేసే ఫైజాన్​అహ్మద్​కలెక్ట్​ చేసుకునేవాడు. ఈ విధంగా పలుమార్లు డ్రగ్స్​తీసుకెళ్లాడు. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చిన ఫైజాన్​అహ్మద్​100 కిలోల ఎఫెడ్రిన్, మెఫెడ్రోన్ కారులో తీసుకెళ్తుండగా, మరోకారును ఎస్కార్టుగా పంపించారు. దీనిపై సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో, బీబీనగర్​పోలీసులు కార్లను ఆపి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఫైజాన్, కృష్ణారెడ్డి, కారు డ్రైవర్ సునీల్​ను అరెస్ట్​చేశారు. శ్రీయాదాద్రి ఫార్మాస్యూటికల్​కంపెనీలో సోమవారం సాయంత్రం నుంచి  మంగళవారం సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి మరో 15 కిలోల డ్రగ్స్ పట్టుకున్నారు. టెక్నీషియన్​సంతోష్, భాస్కర్, ప్రశాంత్​ను అరెస్ట్​ చేశారు. ఇస్మాయిల్​ఇంట్లో 5 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, అతన్ని కూడా అరెస్ట్​ చేశారు. కంపెనీ ఓనర్​ వాసుదేవాచారి, భానుప్రసాద్​, సాల్మాన్​సలీమ్ షేక్​ డోలా, సల్మాన్, సత్యానారాయణ పరారీలో ఉన్నారని డీసీపీ రాజేశ్​చంద్ర తెలిపారు.