- ప్రారంభించనున్న కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్
- పాల్గొననున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం, పొంగులేటి
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మౌసింగ్ బోర్డు కాలనీలో 24 గంటల తాగునీటి సరఫరాను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ఆయన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడే రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా పొంగులేటి, పొన్నంతో కలిసి కేంద్ర మంత్రి ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ కు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి నేరుగా ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రులతో కలిసి తెలంగాణ చౌక్ సమీపంలోని రూ.8.2 కోట్లతో చేపట్టిన మల్టీపర్సస్ పార్క్ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం వెళ్లి రూ.22 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, అనుబంధ పనులను ప్రారంభిస్తారు. తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో 24 గంటలు మంచి నీళ్లను సరఫరా చేసే చారిత్రక కార్యక్రమాన్ని బండి సంజయ్ తో కలిసి ప్రారంభించనున్నారు.
ఇకపై హౌజింగ్ బోర్డు కాలనీ పరిధిలోని 2,660 ఇండ్లకు ప్రతిరోజు 24 గంటలపాటు తాగునీటిని సరఫరా కానుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏ పట్టణంలోనూ 24 గంటలపాటు నిరంతరాయంగా మంచి నీటిని సరఫరా చేస్తున్న దాఖలాల్లేవు. కరీంనగర్ ఆ రికార్డును సాధించబోతోంది. రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టిన నిరంతరాయ మంచి నీటి సరఫరా పనులన్నీ పూర్తయ్యాయి. అనంతరం కేంద్ర మంత్రి, బండి సంజయ్ కుమ్మర్ వాడి హైస్కూల్ కు చేరుకుని స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్‌ను ఆరంభిస్తారు.
అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం నేరుగా కరీంనగర్ బైపాస్ రోడ్డులోని డంప్ యార్డ్ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ వెళ్తారు.
కేంద్రమంత్రి పర్యటన సక్సెస్ చేయాలి
కరీంనగర్ టౌన్,వెలుగు : కేంద్ర పట్టణాభివృద్ది,గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. గురువారం బల్దియా ఆఫీస్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు. పర్యటన రూట్ మ్యాప్, ట్రాఫిక్ సమస్య, ప్రొటోకాల్, బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. పబ్లిక్ మీటింగ్ వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
అనంతరం అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ పార్కు, హౌజింగ్ బోర్డులోని నిరంతర నీటి సరఫరా ఏరియాతో పాటు సభాప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పేయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఎస్ఈ రాజ్ కుమార్ పాల్గొన్నారు.