కోల్కతా: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్ లేదా చిన్న వీడియోలు చేయడం మనం ఇప్పటి వరకు చూశాం. అయితే, కోల్‌కతాకు చెందిన పాంథా దేబ్ అనే ఇన్‌స్టాగ్రామర్ రీల్స్ కోసం ఒక్కరోజు బిచ్చగాడిగా మారాడు.
ఒక బిచ్చగాడు రోజుకు ఎంత సంపాదిస్తాడు.. బిచ్చం వేసేవాళ్ల తీరు ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకొనేందుకు 24 హవర్స్ బెగ్గింగ్ చాలెంజ్ పేరుతో ఓ వీడియో చేశాడు. చినిగిన జీన్స్, టీ-షర్ట్ ధరించి, చేతిలో గిన్నెతో కోల్‌కతా వీధుల్లో, బస్టాప్‌లో, బ్రిడ్జి కింద కూర్చుని అడుక్కున్నాడు. అయితే, అతడు 24 గంటల పాటు అడుక్కున్నా కేవలం రూ.34 మాత్రమే వచ్చాయి. చివరికి ఆ డబ్బును అతడు ఓ వృద్ధ మహిళకు ఇచ్చేశాడు.
ALSO READ : నోటికి అందితేనే వాహనం ముందుకు.. రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్న గజరాజు
ఈ ఘటన జరిగిన కొన్నిరోజుల తర్వాత అతడు ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోకు 7 వేల కంటే ఎక్కువ లైక్స్, 2 లక్షల కంటే ఎక్కువ వ్యూస్వచ్చాయి. అలాగే, ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ రోజుల్లో ఫేమస్ కావడం కోసం జనం ఏమైనా చేస్తారని కొందరు విమర్శించగా.. సేకరించిన డబ్బును విరాళంగా ఇవ్వడం బాగుందని ప్రశంసించారు. ‘‘ముగింపు నా హృదయాన్ని గెలుచుకుంది.. మంచి ప్రయోగం” అని మరొకరు రాసుకొచ్చారు.