24 గంటల కరెంటన్నరు..ఏమైంది? : రైతులు

  •    నల్గొండ జిల్లా చెరుకుపల్లి సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా
  •    ఏఈ హామీతో విరమణ

కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : 24 గంటలు కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదని, దీంతో తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని బుధవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలోని సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. నెలన్నర నుంచి కరెంటు ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదన్నారు. దీంతో పొట్ట దశకు వచ్చిన తమ పంట పొలాలు  ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల నుంచైతే రోజూ  ఉదయం రెండు గంటలు  రాత్రి రెండు గంటలు మాత్రమే కరెంటు ఉంటుందని చెప్పారు.

24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్న సర్కారు దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఏఈ రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన ఏఈ రైతులతో మాట్లాడారు. ఉదయం 8 గంటలు రాత్రి 8 గంటలు కరెంట్​ వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు జటంగిచౌడయ్య,  ఏర్పుల గంగయ్య,  జటంగి వెంకన్న, చెన్నయ్య,  వీరయ్య, వెంకన్న, లింగయ్య, రజాక్, అబ్బయ్య పాల్గొన్నారు.