కొత్త డీలక్స్ బస్సులు వస్తున్నయ్!

కొత్త డీలక్స్ బస్సులు వస్తున్నయ్!
  • ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రవేశపెడుతున్న ఆర్టీసీ
  • తాజాగా 24 మెట్రో డీలక్స్​బస్సులు అందుబాటులోకి.. 
  • నెల రోజుల్లో మరో 101 బస్సులు ప్రారంభిస్తామంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​సిటీ పరిధిలోని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడుతోంది. దశల వారీగా కొత్త బస్సులను తీసుకొస్తోంది. సోమవారం 21 మెట్రో డీలక్స్​బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు గ్రేటర్​హైదరాబాద్​ జోన్​ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ శ్రీనివాస్​వెల్లడించారు. సిటీ వ్యాప్తంగా ప్రస్తుతం 2,850 బస్సులు నడుస్తున్నాయని, పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. 

ఈ నెల 3న మూడు మెట్రో డీలక్స్​బస్సులను ప్రారంభించామని, తాజాగా 21 డీలక్స్ బస్సులను ఆయా రూట్లలో ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. నెల రోజుల్లో మరో 101 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

కీలక రూట్లలో.. 

‘మహాలక్ష్మి స్కీమ్’ అమలులోకి వచ్చాక గ్రేటర్​పరిధిలో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ రూట్లో చూసినా బస్సులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కొత్తగా మెట్రో డీలక్స్​బస్సులను తీసుకొస్తున్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఐటీకారిడార్, హైటెక్​సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మెహిదీపట్నం, ఈసీఐఎల్​రూట్లలో కొత్త బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన 24 బస్సుల్లో

సికింద్రాబాద్​–  ఈసీఐఎల్​రూట్​లో 4, ఉప్పల్– మెహిదీపట్నం రూట్​లో 7, సికింద్రాబాద్– జగద్గిరిగుట్ట రూట్​లో 2, సికింద్రాబాద్​–మెహిదీపట్నం 2, ఈసీఐఎల్ – కోఠి 2, సికింద్రాబాద్– ఎల్​బీనగర్​2, కాచిగూడ రైల్వేస్టేషన్– గండిమైసమ్మ 1, జేబీఎస్ – అబ్దుల్లాపూర్​మెట్​2, సికింద్రాబాద్​– హయత్​నగర్​ రూట్​లో 2 బస్సులను ప్రవేశ పెట్టినట్లు అధికారులు తెలిపారు. త్వరలో ఎంపిక చేసిన రూట్లలో మరిన్ని మెట్రో డీలక్స్​బస్సులను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.